యువతకు ఇష్టమైన స్పోర్ట్స్ బైక్ ఆల్ న్యూ డ్యూక్ 790
పూర్తిగా స్పోర్టీ లుక్ గల కేటీఎం డ్యూక్ 790 బైక్ భారతదేశ మార్కెట్లో ప్రవేశించింది. ట్రయంప్ స్ట్రీట్, యమహా ఎంటీ 09, కవాసాకీ జడ్ 900, డుకాటీ మాన్‌స్టర్ 821 బైక్‌లకు ఇది గట్టి పోటీ ఇవ్వనున్నది. అయితే ఈ ఏడాది కేవలం 100 యూనిట్లు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు.
ముంబై: యువత అమితంగా ఇష్టపడే స్పోర్ట్స్ బైక్స్ తయారీ సంస్థ కేటీఎం భారతదేశ విపణిలోకి మరో అధునాతన బైక్‌ను విడుదల చేసింది. ఆల్ న్యూ 'డ్యూక్ 790' బైక్‌ను సోమవారం సంస్థ భారత మార్కెట్లోకి అధికారికంగా విడుదల చేసింది.
799 సీసీ ఇంజిన్ సామర్థ్యం గల డ్యూక్ 790 బైక్ ప్రారంభ ధర రూ.8.64 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. దేశవ్యాప్తంగా హైదరాబాద్, బెంగుళూరు, ముంబై, పుణె, సూరత్, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, గువాహటిల్లో డ్యూక్ 790 బైక్‌లను తక్షణం బుక్ చేసుకోవచ్చని కంపెనీ అధికారులు తెలిపారు.
షార్ప్ ఫ్యూయల్ ట్యాంక్, ప్రత్యేకమైన ఎల్‌ఈడీ లైట్లు, స్ప్లిట్ సీట్లతో పాటు 799 సీసీ పార్లల్ ట్విన్ మోటార్ ఇంజిన్ అమర్చారు. ఇది 103 బీహెచ్‌పీ శక్తిని 87 ఎన్‌ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ వాహనంలో సింగల్ పీస్ అల్యూమినియం ఫ్రేమ్‌ను అమర్చారు. దీంతో బైకు బరువు గణనీయంగా తగ్గిపోయింది.
క్రోమియం మాలిబ్డినం స్టీల్ ఫ్రేమ్‌తో మిరుమిట్లు గొలుపుతున్న ఈ బైక్‌పై ఈఎంఐ సదుపాయం కల్పిస్తున్నట్టు బజాజ్ ఆటో ఫిన్‌కార్ప్ తెలిపింది. వెయిట్ టు పవర్ నిష్పత్తి ప్రతి టన్నుకు 612 బీహెచ్పీ వరకు ఉంటుంది. ఈ సెగ్మెంట్ బైక్స్‌లో ఇదే అత్యుత్తమమైందని సంస్థ తెలిపింది.
ట్రయంప్ స్ట్రీట్, యమహా ఎంటీ 09, కవాసాకీ జడ్ 900, డుకాటీ మాన్‌స్టర్ 821 బైక్‌లకు డ్యూక్ 790 గట్టి పోటీ ఇవ్వనున్నది. పూర్తిగా సీకేడీ రూట్‌లో బైక్ విడి భాగాలను తీసుకు వచ్చి, భారతదేశంలో అసెంబ్లింగ్ చేస్తారు. ఆస్ట్రేలియాకు చెందిన కేటీఎం ఇండస్ట్రీస్ ఏజీ, ఇండియన్ మాన్యుఫాక్చరర్ బజాజ్ ఆటో, కేటీఎం డ్యూక్ కలిసి ఈ బైక్ నిర్మించాయి. అంతే కాదు ఈ ఏడాది కేవలం 100 బైక్‌లను మాత్రమే మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు.
ఈ బైక్ స్పోర్ట్, స్ట్రీట్, రెయిన్, ట్రాక్ మోడ్‌ల్లో లభ్యం కానుంది. ఎల్ఈడీ హెడ్ టెయిల్ ల్యాంప్స్ విత్ టర్న్ సిగ్నల్స్ కలిగి ఉంటాయి. కేటీఎం డ్యూక్ 790 ఎలక్ట్రానిక్ రైడర్ వల్ల స్టెబిలిటీ కంట్రోల్ సిస్టం, కార్నరింగ్ ఏబీఎస్, మోటార్ స్లిప్ రెగ్యులేషన్, ట్రాక్షన్ కంట్రోల్ యూనిట్ విత్ లీన్ యాంగిల్ అండ్ రైడ్ బై వైర్ తదితర ఆకర్షణలు కలిగి ఉంటుంది.