శ్రీవారి చెంత శివాలయమే.. ఈ కపిలతీర్థం..

శ్రీవారి చెంత శివాలయమే.. ఈ కపిలతీర్థం..

తిరుమల తిరుపతి అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది కలిగయుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి. ఆయన సన్నిధిలో వెలసిన శివ క్షేత్రమే ఈ కపిలి తీర్థం. తిరుపతి కొండలకు ఆనుకుని అలిపిరి దిగువకు వెళ్తే కపిలతీర్థం కనిపిస్తుంది. శ్రీవారి దర్శనానికి వెళ్లిన ప్రతి ఒక్కరూ..  కచ్చితంగా కపిలతీర్థానికి వెళుతూ ఉంటారు. అక్కడి వాతావరణం కూడా చాలా ఆహ్లదకరంగా ఉంటుంది. ప్రకృతి రమణీయ దృశ్యాలు చూపుతిప్పుకోలేనంత అందంగా ఉంటాయి.

అసలు ఈ కపిల తీర్థం ఎలా ఏర్పడిందో తెలుసా...?

పూర్వం అంటే కృతయుగంలో కపిల మహర్షి ఇక్కడ ఈశ్వరుని కోసం ఘోర తపస్సు చేశాడట. ఆ తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు పాతాళంనుంచి భూమిని చీల్చుకుని ఇక్కడ వెలిశాడని స్థలపురాణం. కపిలముని తపస్సు కారణంగా ఇక్కడ కొలువైనది ఈశ్వరుడు కాబట్టి ఈ స్వామికి కపిలేశ్వరుడు అని పేరు వచ్చింది. ఇక్కడి లింగాన్ని కూడా కపిల లింగం అంటారు. ఆ తరవాత త్రేతాయుగంలో అగ్నిదేవుడు ఈ క్షేత్రంలో ముక్కంటిని పూజించాడట. అందువల్ల, ఈ లింగాన్ని ఆగ్నేయ లింగమనికూడా పిలుస్తారు.

ఆలయ నిర్మాణం...

ఈ ఆలయాన్ని 11వ శతాబ్ధంలో నిర్మించారు. అప్పుడు ఈ ప్రాంతాన్ని రాజేంద్రచోళుడు అనే రాజు పరిపాలించేవాడు.  ఆయన పాలనలోనే ఈ  ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. చోళులు శివ భక్తులు కావడంతో  ఈ ఆలయాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్మించారు. కాలక్రమంలో వైష్ణవులు దీనిని ఆళ్వారుతీర్థంగా మార్చారు. 18వ శాతాబ్ధం వరకు దీనిని ఆళ్వారు తీర్థంగానే పిలిచారు.

ప్రత్యేకతలు..

కపిలతీర్థానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. కార్తీక మాసంలో ఈ ఆలయాన్ని దర్శించుకుంటే చాలా మంచి జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. కార్తీక పౌర్ణమినాడు మధ్యాహ్నవేళ ముల్లోకాల్లోని సకలతీర్థాలూ నాలుగు గంటలపాటు కపిలతీర్థంలో నిలుస్తాయని నమ్మకం. ఆ సమయంలో ఈ తీర్థంలో స్నానమాచరిస్తే సకల పాపాలూ పోతాయని అందరూ నమ్ముతారు. స్నానమాచరించిన తరవాత నువ్వుగింజంత బంగారాన్ని దానం చేసినా... కొండంత పుణ్యం లభిస్తుందని చెబుతారు. అందుకే కార్తీకమాసం ప్రారంభం కాగానే ఈ తీర్థానికి భక్తులు తండోపతండాలుగా తరలి వస్తుంటారు. నిత్యం ఈ తీర్థంలో పుణ్యస్నానాలు చేసి పరమేశ్వరుడికి ప్రీతికరంగా దీపాలు వెలిగిస్తారు.

కొండలమీది నుంచి గలగలా పారుతూ, 20 అడుగుల ఎత్తునుంచి ఆలయ పుష్కరిణిలోకి దూకుతుంది ఆకాశగంగ. ఈ పుష్కరిణినే కపిలతీర్థం అంటారు. ఈ తీర్థాన్ని శైవులు కపిల తీర్థమనీ, వైష్ణవులు ఆళ్వార్‌ తీర్థమనీ పిలుస్తారు. వైష్ణవులు కోనేటి చుట్టూ నాలుగు మూలల్లోనూ నాలుగు సుదర్శన రాతిశిలలను స్థాపించారట. రాతిమెట్లు, సంధ్యావందన దీపాలనూ ఏర్పాటుచేశారు. అందుకే, అప్పట్నుంచీ దీన్ని చక్రతీర్థమని పిలిచేవారు వైష్ణవులు. అంతేకాదు.. ఈ శైవ క్షేత్రం వద్ద వెంకటేశ్వరస్వామి చిన్న విగ్రహం కూడా ఉంటుంది.  దీనిని వైష్ణవ భక్తులు ఏర్పాటు చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి.

ఆలయానికి ఎలా వెళ్లాలి..?

తిరుపతి బస్టాండు నుంచి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో అలిపిరి మార్గంలో కపిలతీర్థం ఆలయం ఉంది. బస్టాండు సమీపంలోని రైల్వేస్టేషన్‌ నుంచి ప్రతీ అరగంటకూ నడిచే తితిదే ఉచిత బస్సుల ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు. ఆటోలూ ఉంటాయి. మదనపల్లి, చిత్తూరుల నుంచి తిరుపతి వచ్చే బస్సులు ఈ ఆలయం మీదుగానే వెళ్తాయి.

మంచి పర్యాటక ప్రాంతానికి వెళ్లాలనుకునేవారికి ఇది అనువైన ప్రదేశం. ముఖ్యంగా వర్షాకాలంలో కుటుంబంతో సహా వెళితే.. పుణ్యం.. పురుషార్థం దక్కుతుంది.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM NEWS

Next page