న్యూఢిల్లీ: సంక్షోభంలో చిక్కుకున్న ఆటోమొబైల్ రంగానికి ప్రోత్సాహలను అందుబాటులోకి తెచ్చేందుకు చాలా పాత కార్ల వినియోగాన్ని నిరుత్సాహ పర్చేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది. దేశంలో 15 ఏళ్లకు పైబడిన కార్ల రీ-రిజిస్ట్రేషన్‌ రుసుమును 25 రెట్ల వరకు, వాణిజ్య వాహనాలకైతే ఫిట్‌నెస్‌ పరీక్షల రుసుమును 125 రెట్ల వరకు పెంచాలని ప్రతిపాదించింది.

కొత్త ప్రతిపాదనపై అభిప్రాయాన్ని కోరుతూ రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఆయా మంత్రిత్వ శాఖలకు పాలసీ పత్రాన్ని పంపింది. కొత్త పాలసీని 2020 జూన్‌కల్లా అమలులోకి తేవాలని భావిస్తోంది. కొత్త ప్రతిపాదన అమల్లోకి వస్తే పదిహేనేళ్లు పైబడిన ట్రక్కు లేదా బస్సు ఫిట్‌నెట్‌ పరీక్ష కోసం కట్టాల్సిన రుసుము రూ.200 నుంచి ఏకంగా రూ.25,000కు పెరగనుంది.
 
క్యాబ్‌, ట్యాక్సీ, మినీ ట్రక్కులకు రుసుము వరుసగా రూ.15 వేలు, రూ.20వేలకు పెరిగే అవకాశం ఉంది. ఇక వ్యక్తిగత అవసరాల కోసం ఉపయోగించే నాలుగు చక్రాల వాహనాల రీ-రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.600 నుంచి రూ.15 వేలకు చేరుకోవచ్చు.

ప్రస్తుతం రూ.300గా ఉన్న టూ వీలర్‌, త్రీ వీలర్‌ రిజిస్ట్రేషన్‌ రెన్యువల్‌ ఫీజు వరుసగా రూ.2,000, రూ.3,000కు పెరగవచ్చు. 15 ఏళ్ల తర్వాత వాహన రిజిస్ట్రేషన్‌ను ప్రతి ఐదేళ్లకోసారి రెన్యువల్‌ చేసుకోవాల్సి ఉంటుంది.