ఇప్పటివరకు 22 క్యారెట్స్ గోల్డ్, 24క్యారెట్స్ గోల్డ్, 18క్యారెట్స్ గోల్డ్ గురించి విని ఉంటారు. మరి కంప్యూటర్ పార్ట్స్ తో తయారు చేసిన బంగారు నగల గురించి విన్నారా..? మీరు చదివింది నిజమే.. కంప్యూటర్ పార్ట్స్ తో బంగారు నగలను తయారు చేస్తున్నారు. అది కూడా ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ ‘డెల్’ ఈ బంగారు నగలను తయారు చేయడం విశేషం.

ఈ వారంలో ఆ బంగారు నగలు మార్కెట్ లోకి వచ్చి సందడి చేయనున్నాయి. కంప్యూటర్లోని పాడైపోయిన మథర్ బోర్డ్ లను రీసైకిల్ చేసి వాటిలోని బంగారంతో ఆభరణాలు తయారు చేస్తున్నారు. హాలీవుడ్ నటి నిక్కీరీడ్( ట్విలైట్ సినిమా ఫేం) ఈ బంగారు ఆభరణాల తయారీలో డెల్ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. వీరిద్దరి పార్టనర్ షిప్ లోనే ఈ ఆభరణాలు తయారు చేస్తున్నారు.

లిమిటెడ్ ఎడిషన్ లో ఈ వారం మార్కెట్ లో విడుదల చేయనున్నారు. ఈ ఆభరణాలన్నీ.. 14 క్యారెట్స్, 18క్యారెట్స్ బంగారు ఆభరణాలు కావడం గమనార్హం. చెవిదిద్దులు, ఉంగరాలు, కఫ్ లింక్స్ లాంటి వాటిని ఎక్కువగా తయారు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం పనికిరాని ఫోన్లు, ల్యాప్ టాప్ ల వల్ల 60మిలియన్ డాలర్లు విలువచేసే వెండి, బంగారాలను వృథా అయిపోతున్నాయట. అందుకే.. వాటిని ఇలా రీసైకిల్ చేసి ఆభరణాలు తయారు చేస్తున్నామని డెల్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ బంగారు ఆభరణాల ఖరీదు 78డాలర్ల నుంచి ప్రారంభం కానుంది.