Asianet News TeluguAsianet News Telugu

అగ్గువకే వెహికల్స్.. ఆకర్షణీయ ప్రకటనలో సైబర్ చీటర్ల బురిడీ

తక్కువ ధరకే వాహనాలు విక్రయిస్తామన్న ఆఫర్లతో సైబర్ నేరగాళ్లు మోసగిస్తున్నారని హైదరాబాద్ నగర క్రైం బ్రాంచ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇటువంటి ఆఫర్లు ప్రకటించే వెబ్ సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
 

Cyber cheates Cheating in the name of affordable Offers
Author
Hyderabad, First Published Aug 8, 2019, 1:45 PM IST

హైదరాబాద్: సైబర్ మోసగాళ్ల ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. వీటిని జాగ్రత్తగా గమనించకుండా బుట్టలో పడితే వేల నుంచి లక్షల రూపాయల్లో నష్టపోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవలే కారు లేదా బైక్ కొన్నాం.. అత్యవసరంగా విక్రయించాల్సి వస్తున్నదని, తక్కువ ధరకే ఇచ్చేస్తామన్న ఆకర్షణీయ మెసేజ్‌లతో సైబర్ మోసగాళ్లు అమాయకులను ఆకట్టుకుంటున్నారు. 

బుట్టలో పడిన అమాయకులతో కొంత అడ్వాన్స్ చెల్లిస్తే మీకు వాహనం అప్పగించాక మిగతా సొమ్ము చెల్లించొచ్చని నమ్మ బలుకుతున్నారు. ఇలా నమ్మి అడ్వాన్స్ వారి ఖాతాల్లో జమ చేశాక అందుబాటులోకి రాకుండా తప్పించుకుంటున్నారు. ఓఎల్‌ఎక్స్‌, క్వికర్‌ వెబ్‌సైట్లే వేదికగా ఈ తనహా మోసాలకు పాల్పడుతున్నారు. 

కొంత నగదు ఖాతాల్లో ‘అడ్వాన్స్’ పేరిట వేయించుకుని మరుక్షణం సంప్రదింపులు నిలిపేస్తున్నారు. ఇలా రోజూ రూ.5-10లక్షల చొప్పున నెలకు రూ.2 కోట్ల నగదు కొల్లగొడుతున్నారు. మోసపోయిన బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. వాహనం చేతికి వచ్చాకే డబ్బు ఇవ్వాలని, ఇటువంటి ప్రకటనలను నమ్మొద్దని పోలీస్‌ అధికారులు సూచిస్తున్నారు.

భారీ రాయితీలు, తక్కువ ధరకే వస్తువులు అంటే చాలు మధ్యతరగతి వర్గ ప్రజల నుంచి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ల వరకు ఆశ పడుతుంటారు. దీనినే సైబర్‌ నేరగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. ప్రతి ప్రకటనా భిన్నంగా ఉండేలా చూసుకోవడంతోపాటు వేర్వేరు ఫోన్‌ నంబర్లనూ ఇస్తున్నారు. 
వెబ్‌సైట్లలో ఈ తరహా వార్తలను చూసినవారు కొత్త వస్తువులు తక్కువకే వచ్చేస్తాయన్న సంతోషంతో వారి మాయలోపడి చేతి చమురు వదిలించుకుంటున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు ద్విచక్ర వాహనాలు, కార్ల పేరుతో సైబర్‌ నేరస్థులు అనేకమందిని మోసం చేశారు. 50శాతం ధరకే కారు వస్తుండడంతో గత నెలలో సుమారు 50 మంది డ్రైవర్లు సైబర్‌ నేరస్థుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసి చేతులు కాల్చుకున్నారు.

హోండా యిక్టివా, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌, మారుతి స్విఫ్ట్‌ కార్లు ఇస్తామంటూ సైబర్‌ నేరస్థులు వెబ్‌సైట్‌లో రెండు నిమిషాలకో ప్రకటన ఇస్తున్నారు. బైక్‌, కారు కావాలనుకున్న బాధితుల నుంచి కనిష్టంగా రూ.50వేలు, గరిష్టంగా రూ.3లక్షలు వసూలు చేసుకుంటున్నారు. రాజస్థాన్‌, ఢిల్లీ, నోయిడా కేంద్రాలుగా మోసాలకు పాల్పడుతున్న ముఠాలు రోజుకు 100-200 మందితో మాట్లాడుతున్నాయి. 

కనీసం 10శాతం మందితో నగదు జమ చేయించుకుంటున్నారు. ఇలా సైబర్‌ నేరస్థుల ఆర్జన నిత్యం రూ.5-10లక్షలు ఉంటోంది. బాధితులు నమ్మేందుకు వీలుగా ఇంటర్నెట్ ద్వారా హైదరాబాద్‌ పరిసర ప్రాంతాలనూ గుర్తుపెట్టుకుంటున్నారు.

హైదరాబాద్‌ రవాణా శాఖ కార్యాలయంలో నమోదు చేసుకున్నట్టు కార్లు, బైక్‌ల ఫొటోలను ప్రకటనల్లో ఉంచుతున్నారు..ఇద్దరు లేదా ముగ్గురు నేరస్థులు కలిసి కేవలం సిమ్‌కార్డులు, చేతిలో ల్యాప్‌టాప్‌తో పనికానిచ్చేస్తున్నారని సైబర్‌ క్రైమ్‌ విభాగం పోలీసులు తెలిపారు.

హైదరాబాద్ నేర పరిశోధన విభాగం జాయింట్ కమిషనర్‌ అవినాష్‌ మహంతి మాట్లాడుతూ ఓఎల్‌ఎక్స్‌, క్వికర్‌, జస్ట్‌డయల్‌లో వచ్చే ప్రకటనలలో నిజమెంతన్నది తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రజలదేనన్నారు. ప్రకటనలకు స్పందించిన తర్వాత వారు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారని తెలుసుకోవాలని సూచించారు. 

ఢిల్లీ, ముంబై, బెంగళూరులో ఉంటున్నామని చెబితే ఎవరైనా స్నేహితుల ద్వారా విచారించుకుంటే శ్రేయస్కరం అని హైదరాబాద్ నేర పరిశోధన విభాగం జాయింట్ కమిషనర్‌ అవినాష్‌ మహంతి హితవు పలికారు. కార్లు, బైకులు తక్కువ ధరకే ఇస్తున్నామని చెబితే ఎందుకు ఇస్తున్నారన్నది ఆలోచించాలని స్పష్టం చేశారు.

నిజంగా సెకండ్ హ్యాండ్ వాహనాలను కొనాలనుకుంటే హైదరాబాద్‌లోనే ప్రీ-ఓన్డ్‌ కార్ల షోరూంలు, ద్విచక్రవాహన విక్రయదారులు ఉన్నారని హైదరాబాద్ నేర పరిశోధన విభాగం జాయింట్ కమిషనర్‌ అవినాష్‌ మహంతి గుర్తు చేశారు. ముందుగా డబ్బులు చెల్లించాలని సూచిస్తే కచ్చితంగా మోసమేనని హెచ్చరించారు. వాటికి స్పందించకుండా ఉంటే ఇంటర్నెట్ ఆధారిత నేరాలు తగ్గే అవకాశాలున్నాయన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios