Asianet News TeluguAsianet News Telugu

ఓలాకు షాక్... ఆరునెలల పాటు నిషేధం విధింపు

 బైక్ ట్యాక్సీలు నిర్వహించినందుకు ‘ఓలా’ క్యాబ్ సర్వీసులపై ఆరు నెలల పాటు కర్ణాటకలో నిషేధం విధించడం వల్ల ఇటు క్యాబ్ సర్వీసులు నడిపే డ్రైవర్లు, అటు వినియోగదారులు పలు ఇబ్బందుల పాలవుతారని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఓలా క్యాబ్స్ యాజమాన్యం మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని సోమవారం హైకోర్టులో సవాల్ చేస్తామని సంకేతాలిచ్చింది. 
 

Customers, cabbies fear Ola ban may hit commuting, income
Author
Bangalore, First Published Mar 23, 2019, 2:49 PM IST

బెంగళూరు: ప్రముఖ క్యాబ్‌ సర్వీస్‌ సంస్థ ‘ఓలా’కు కర్ణాటకలో షాక్‌ తగిలింది. ఓలా ట్యాక్సీలు, ఆటోలపై ఆ రాష్ట్ర రవాణాశాఖ ఆరు నెలల పాటు నిషేధం విధించింది. అనుమతి లేకుండా బైక్‌ ట్యాక్సీలను నడుపుతున్నందుకు రవాణాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల ఇటు క్యాబ్ సంస్థకు, అటు వినియోగదారులకు కష్టాలు ఎదురవుతాయని అంచనా వేస్తున్నారు. అందునా లోక్ సభ ఎన్నికల వేళ క్యాబ్ లపై నిషేధం విధించడమేమిటని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

శుక్రవారం నిషేధం ఉత్తర్వులు అందుకున్న ‘ఓలా’ క్యాబ్స్ యాజమాన్యం.. దీన్ని సోమవారం హైకోర్టులో సవాల్ చేస్తామని ప్రకటించింది. కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలను నడపం నిషేధం. అయితే నిబంధనలను ఉల్లంఘిస్తూ గత జనవరి నుంచి ఓలా బెంగళూరులోని కొన్ని ప్రాంతాల్లో బైక్‌ ట్యాక్సీలను నిర్వహిస్తోంది.

బైక్ ట్యాక్సీలు ఎలా నడుపుతున్నారంటూ రవాణాశాఖ ఓలాకు గతంలో షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. వీటికి స్పందించిన సంస్థ.. ప్రజల నుంచి సమాచారం సేకరించేందుకు బీటా పైలట్‌ ప్రాజెక్టు కింద ఈ ట్యాక్సీలను నడుపుతున్నామని తెలిపింది. 

అయితే సంస్థ ఇచ్చిన వివరణ అసంపూర్ణంగా ఉండటంతో ఓలాపై రవాణాశాఖ చర్యలు చేపట్టింది. ఆరు నెలల పాటు ఓలా లైసెన్సును సస్పెండ్‌ చేస్తున్నట్లు తెలిపింది. కంపెనీ ట్యాక్సీలు, ఆటోలు నడపకుండా నిషేధం విధించింది.

ఈ నిషేధంపై ఓలా అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘ఇది చాలా దురదృష్టకరం. చట్టాలకు అనుగుణంగానే ఓలా వ్యవహరిస్తుంది. ప్రజల రవాణా సదుపాయాలు మెరుగుపర్చేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుంది. ఈ విషయంపై అధికారులతో చర్చిస్తున్నాం’ అని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. 

ప్రజా రవాణా వ్యవస్థ మెరుగుదలకు ప్రభుత్వం ఏమీ చేయకపోగా, సామాన్యుడికి గల కొన్ని ట్రాన్స్ పోర్ట్ ఆప్షన్లపైనా ఆంక్షలు విధించడమేమిటని ప్రజలు విమర్శిస్తున్నారు. తాము తీసుకున్న ఓలా మనీ, ఓలా పాస్ వల్ల ఉపయోగమేమిటని అంటున్నారు. 

ఓలా క్యాబ్స్ రావడంతో ప్రజల జీవనం తేలికైందని, వ్యక్తిగత వాహనాల వినియోగం తగ్గిందని చెబుతున్నారు. వెంటనే ఓలా క్యాబ్ లు నిలిపేయకుంటే రవాణాశాఖ అధికారులు బలవంతంగా నిలువరిస్తున్నారు. ఇబ్బందికరంగా మారితే సీజ్ చేసేస్తున్నారు. వచ్చే నెల నుంచి కార్ల నెల వారీ రుణ వాయిదాలు చెల్లించడం ఎలా? అని క్యాబ్ డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు. 

బెంగళూరు వంటి కీలక మార్కెట్ లో రోజు 20 లక్షల మంది క్యాబ్ సర్వీసులపైనే ఆధారపడి పని చేస్తారని విశ్లేషకులు చెబుతున్నారు. క్యాబ్ సర్వీసులను వినియోగిస్తున్న ప్రధాన నగరాల్లో బెంగళూరు ఒకటని అంటున్నారు. బెంగళూరులో ఓలా, ఉబేర్ క్యాబ్ లు టాప్ -3లో నిలుస్తాయన్నారు.  చట్ట విరుద్ధంగా బైక్ ట్యాక్సీల నిర్వహణ ద్వారా క్యాబ్ సర్వీసుల, డ్రైవర్ల ఆదాయం తగ్గడానికి కారణమైనందుకు ఓలాపై నిషేధం విధించడం సబబేనని జేడీఎస్ నాయకుడు తన్వీర్ పాషా పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios