Asianet News TeluguAsianet News Telugu

ఈ-కామర్స్ ఫెస్టివ్ సేల్స్.. 1.4 లక్షల కొలువులు

ఆటోమొబైల్ రంగం విక్రయాలు లేక విలవిలలాడుతున్నది. మరోవైపు ఈ- కామర్స్ రిటైలర్లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ కం వాల్‌మార్ట్ మాత్రం త్వరలో ప్రారంభమయ్యే పండుగల సీజన్‌లో వినియోగదారులకు సేవలందించేందుకు 1.4 లక్షల మంది తాత్కాలిక ఉద్యోగులను నియమించుకున్నాయి.

Amazon, Flipkart create over 1.4 lakh temporary jobs ahead of festive sales
Author
Hyderabad, First Published Sep 25, 2019, 11:13 AM IST

న్యూఢిల్లీ: పండగల సీజన్‌ సందర్భంగా ఈ-కామర్స్‌ దిగ్గజాలైన అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ దాదాపు 1.4 లక్షల తాత్కాలిక ఉద్యోగులను నియమించుకున్నట్లు ప్రకటించాయి. అమెజాన్‌ 90 వేల మందికి, ఫ్లిప్‌కార్ట్‌ 50 వేల మందికి ఉద్యోగాలను ఇచ్చినట్లు తెలిపాయి.

గోడౌన్ల నుంచి వినియోగదారుల సేవా కేంద్రాల వరకూ వివిధ స్థాయుల్లో వీరంతా పని చేస్తారని తెలిపాయి. అమెజాన్‌ ఇండియా ఈ నెల 29 నుంచి అక్టోబర్ 4 వరకు గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ను నిర్వహిస్తుండగా ఫ్లిప్‌కార్ట్‌ కూడా అదే తేదీల్లో బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ పేరుతో ఫెస్టివల్‌ను నిర్వహిస్తోంది.

గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది అదనంగా 30% ఉద్యోగాలను సృష్టించినట్లు ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. తాత్కాలిక ఉద్యోగ నియామకాలతో కస్టమర్లకు అత్యుత్తమ సేవల్ని అందించేందుకు వీలు కలుగుతుందని అమెజాన్‌ పేర్కొంది.

దేశవ్యాప్తంగా 11 నగరాల్లో 15 కేంద్రాలతో కస్టమర్లకు సేవలందిస్తున్నామని అమెజాన్ తెలిపింది. ఈ-మెయిల్‌, చాటింగ్‌, సోషల్‌ మీడియా, ఫోన్‌ కాల్స్‌ ద్వారా ఆంగ్లం, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వినియోగదారులతో నిత్యం మాట్లాడేందుకు ఈ కేంద్రాల్లో తమ సిబ్బంది అందుబాటులో ఉంటారని వివరించింది.

గోడౌన్ల విస్తీర్ణాన్ని, డెలివరీ కేంద్రాల సంఖ్యను కూడా అమెజాన్‌ భారీగా పెంచేయడం గమనార్హం. దేశవ్యాప్తంగా 750 నగరాల్లో 1400 డెలివరీ కేంద్రాల్ని ఆ సంస్థ నిర్వహిస్తోంది.

ఫ్లిప్‌కార్ట్‌ కొత్తగా తీసుకుంటున్న వారందరికీ శిక్షణనిచ్చింది. ప్రభుత్వం రూపొందించిన జాతీయ నైపుణ్యాభివృద్ధి మిషన్‌లో భాగంగా ఈ మొత్తం ఉద్యోగ కల్పన జరుగుతోందని తెలిపింది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతంగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేసింది.

ఈ-కామర్స్‌ సంస్థ స్నాప్‌డీల్. భారత్‌లోని చిన్న నగరాలు, పట్టణాలపై దృష్టి పెట్టింది. పండగ సీజన్లో తమ అమ్మకాల్లో 85% ఆ ప్రాంతాలనుంచే ఉంటాయని అంచనా వేస్తోంది.

ఈ నెల 29 నుంచి అక్టోబర్ ఆరో తేదీ వరకూ జరిగే తమ ఫెస్టివ్‌ సేల్‌లో చిన్న పట్టణాలు, మధ్యతరగతికి చెందిన ప్రజల్ని ఆకర్షించడమే తమ లక్ష్యమని తెలిపింది. పండగ సీజన్‌కు తమ అమ్మకాల లక్ష్యం ఎంతన్నది మాత్రం స్నాప్‌డీల్‌ చెప్పలేదు.

పండుగల సీజన్ల పేరిట ఈ-కామర్స్‌ సంస్థల అమ్మకాలు, నగరాల్లోని రిటైల్‌ వర్తకులకు శాపంగా పరిణమించాయి. అసలే నగరాల్లో అద్దెలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ-కామర్స్‌ సంస్థల నుంచి గట్టి పోటీతో రిటైల్‌ వర్తకులు నగరాలను విడిచి, చిన్న పట్టణాలపై దృష్టి పెడుతున్నారు. ప్రాపర్టీ కన్సల్టెంట్‌ సంస్థ జేఎల్‌ఎల్‌ ఈ సంగతి తెలిపింది.

నగరాల్లో ఉన్న గడ్డు పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు చిన్న పట్టణాలను రిటైల్‌ వర్తకులు లక్ష్యంగా ఎంచుకుంటున్నారని తెలిపింది. నగరాలతో పోలిస్తే.. అక్కడి మార్కెట్లలో 30 నుంచి 40 శాతం ఖర్చు తగ్గి, వారి వ్యాపారం లాభసాటిగా నడుస్తుందని వెల్లడించింది

రిటైలర్లు వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు ఆన్‌లైన్‌లో సైతం అందుబాటులో ఉంటున్నారని పేర్కొంది. నగరాల్లోని షాపింగ్‌ మాల్స్‌లో ప్రీమియం బ్రాండ్‌లు రెండింతలెక్కువ చెల్లించి మరీ అద్దె ఒప్పందాన్ని పొడిగించుకుంటున్నారని జేఎల్ఎల్ తెలిపింది.

చిన్న రిటైలర్లు ఈ భారీ అద్దెల్ని తట్టుకోలేకపోతున్నారని జేఎల్‌ఎల్‌ వివరించింది. అందుకే నగరంలో కొనసాగే పక్షంలో ఆదాయంలో వాటాను అద్దెగా తీసుకునే షాపింగ్‌ మాల్స్‌ను ఎంచుకుంటున్నారని పేర్కొంది.

ఇదిలా ఉండగా, దసరా పండుగ వేళ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కనీవినీ ఎరుగని రాయితీలు, బోల్డన్ని ఆఫర్లతో వినియోగదారులను ఊరిస్తోంది. ఈ నెల 29వ తేదీ నుంచి ‘బిగ్‌ బిలియన్ డేస్’ సేల్‌‌తో ఆఫర్లకు తెర తీయనుంది. వచ్చే నెల 4 వరకు కొనసాగనున్న సేల్‌లో వందలాది డీల్స్ అందుబాటులోకి రానున్నాయి.

ఆఫర్లు ఊరిస్తున్నా.. చేతిలో క్రెడిట్ కార్డు లేదే అని బాధపడుతున్న వారికి ఫ్లిప్‌కార్ట్ శుభవార్త చెప్పింది. ఎటువంటి కార్డులు అవసరం లేకుండా ఏకంగా లక్ష రూపాయల వరకు షాపింగ్ చేసుకునే అద్భుత అవకాశాన్ని కస్టమర్లకు అందించేందుకు సిద్దమైంది.

ముందు కొనండి.. తర్వాత చెల్లించండి’ పేరుతో ఈ ఆఫర్‌ను అందుబాటులోకి తెస్తోంది. ఇందుకోసం ముందస్తుగా డౌన్ పేమెంట్ చెల్లించాల్సిన పని కూడా లేదని ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది.

ఇందులో భాగంగా ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లకు మూడు పేమెంట్ ఆప్షన్లు ఉంటాయి. అందులో మొదటిది.. జీరో వడ్డీతో తర్వాతి నెల చెల్లించడం. రెండోది జీరో వడ్డీతో మూడు నెలల్లో ఈఎంఐ ద్వారా చెల్లించడం. చివరిది 12 నెలల ఈఎంఐ విధానంలో చెల్లించడం. ఇందుకోసం ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు ఉండదు.

కాకపోతే డిజిటల్ కేవైసీ ప్రాసెస్‌ను పూర్తిచేయాల్సి ఉంటుంది. పండుగ షాపింగ్ కోసం క్రెడిట్ కార్డులు ఉపయోగించకుండా, పర్సనల్ లోన్ తీసుకోకుండా ప్రోత్సహించేందుకే ఈ విధానాన్ని ప్రవేశపెట్టినట్టు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది

తొలుత పాన్ నంబర్, ఇతర వివరాలు, ఎంత వరకు కొనుగోలు చేయాలనుకుంటున్నారన్న వివరాలను నమోదు చేయాలి. రెండు నిమిషాల్లో పూర్తయ్యే కేవైసీ వివరాలను ఎంటర్ చేయాలి. కార్డ్‌లెస్ క్రెడిట్ ఆప్షన్ ద్వారా షాపింగ్ చేసుకోవాలి. మై అకౌంట్స్, కార్డ్‌లెస్ క్రెడిట్ ఆప్షన్‌లోకి వెళ్లి క్రెడిట్ లిమిట్‌ను చెక్ చేసుకోవచ్చు.

Follow Us:
Download App:
  • android
  • ios