ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ కొద్ది సేపటి క్రితం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ప్రమాణ స్వీకారానికి తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమం అనంతరం ఇద్దరూ కలిసి ఒక విమానంలో ఢిల్లీ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. కాగా అకస్మాత్తుగా వారి పర్యటన రద్దు అయ్యింది.  ప్రధాని గా నరేంద్రమోదీ రెండో సారి ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. 
 
ఈ కార్యక్రమానికి జగన్, కేసీఆర్ లకు ఆహ్వానాలు అందాయి. దీంతో... ఇరువురూ కలిసి ఆ కార్యక్రమానికి వెళదాం అనుకున్నారు. కానీ ఇప్పుడు వారి ఢిల్లీ పర్యటన రద్దు అయ్యింది. ఢిల్లీ లో విమానం ల్యాండింగ్ కి అనుమతి లేకపోవడంతో వీరి పర్యటన రద్దు అయ్యింది. షెడ్యూల్ లోని విమానాల ల్యాండింగ్ కి పౌరవిమానయాన శాఖ అనుమతులు రద్దు చేసింది.

ప్రధాని ప్రమాణ స్వీకార మహోత్సవం కాబట్టి... ఎలాంటి భద్రతా లోపాలు తలెత్తకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. అయితే... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ విమానానికి ముందుగా అనుమతి తీసుకోకపోవడంతో... వారి పర్యటనను రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.