పార్టీ పేరిట హోటల్ కి పిలిచారు. వారు చెప్పింది నిజమనుకొని యువతి ఆ హోటల్ కి వెళ్లింది. కానీ.. అక్కడ ఆమెను అతి దారుణంగా మోసం చేశారు. ఒకరి తర్వాత మరకొరు సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ సంఘటన ముంబయిలో చోటుచేసుకోగా.. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

సెంట్రల్ ముంబయి కి చెందిన  అవినాశ్ పంగేకర్(28) అనే యువకుడికి ఇటీవల నిశ్చితార్థమయ్యింది. కాగా.. స్నేహితులందరికీ పార్టీ ఇవ్వాలని అనుకున్నాడు. శిశిర్‌(27), తేజస్‌(25)లతో పాటు మరో ముగ్గురు యువతులను పార్టీకి పిలిచాడు. అంధేరీలో- కర్లా రోడ్డులో గల హోటల్‌లో పార్టీ చేసుకున్న అనంతరం అవినాశ్‌, శిశిర్‌, తేజస్‌ బాధిత యువతి(22)పై అత్యాచారానికి పాల్పడ్డారు.  ఆమెను అక్కడే వదిలేసి హోటల్‌ నుంచి పరారయ్యారు. 

కాగా తనకు జరిగిన అన్యాయం గురించి తలచుకుని తీవ్ర వేదనకు లోనైన బాధితురాలు, ఎట్టకేలకు ధైర్యం చేసి తనకు ఎదురైన చేదు అనుభవం నుంచి శనివారం కుటుంబ సభ్యులకు చెప్పింది. వారి మద్దతుతో ఆదివారం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పార్టీలో తనను మద్యం సేవించాల్సిందిగా బలవంతం చేశారని, ఆపై అకృత్యానికి ఒడిగట్టారని వాపోయింది. 

తనతో పాటు వచ్చిన ఇద్దరు మహిళలను ఇంటికి పంపించేసి, తనను బంధించి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపించింది. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, అదే విధంగా బాధితురాలిని కూపర్‌ ఆస్పత్రికి పంపించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు.