కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన రాజీనామా నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలంటూ ఆ పార్టీ యువజన విభాగం నేతలు, కార్యకర్తలు నిరసనకు దిగారు.  రాజకీయాల్లో గెలుపొటములు సహజమేనని.... పూర్తి నిబద్ధతతో పనిచేసిన రాహుల్ గాంధీ ఇటువంటి నిర్ణయం తీసుకోవడం సరికాదని కాంగ్రెస్ యువ ఎమ్మెల్యే అశోక్ చాంద్న అన్నారు.

మహాభారతంలో శకుని వంచన రాజకీయాల వల్ల ధర్మరాజు అరణ్య వాసానికి వెళ్లాడని.. అంతమాత్రం చేత శకుని, దుర్యోధనుడు చేసిన పనులు మంచివని అర్ధమా..? కాదని అశోక్ అభిప్రాయపడ్డాడు.

కురుక్షేత్ర యుద్ధం తర్వాత ధర్మరాజు మళ్లీ వచ్చాడని.. అమిత్ షా శకుని వంటి వ్యక్తని.. మహాభారతం నుంచి బీజేపీ కొన్ని విషయాలు నేర్చుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్‌కి రాహుల్ గాంధీయే అధ్యక్షుడిగా ఉండి.. పార్టీని ముందుండి నడిపించాలని యువ కాంగ్రెస్ నేతలు నినాదాలు చేశారు. రాహుల్ తన నిర్ణయాన్ని మార్చుకోవాలని ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.