రైల్లో ఓ యువతికి చేదు అనుభవం ఎదురైంది. తాత వయసు ఉన్న వ్యక్తి... యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె వెనుక భాగాన్ని చేతులతో తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటనపై యువతి పోలీసులకు ఫిర్యాదు చేస్తే... వాళ్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడం గమనార్హం. దీంతో... ఆ యువతి తన బాధనంతటినీ ఫేస్ బుక్ లో వ్యక్తపరిచింది. కాగా.. ఆ పోస్టు వైరల్ గా మారింది.

పూర్తి వివరాల్లోకి వెళితే... బెంగళూరు నగరంలోని ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో ఇంజనీర్‌గా పని చేస్తున్న యువతి ఈనెల17వ తేదీన విధులు ముగిసిన అనంతరం రైలులో స్నేహితులతో కలసి కేజీఎఫ్‌ పట్టణానికి వెళుతున్నారు. రైలు బయలుదేరిన కొద్దిసేపటికి యువతి నిద్రలోకి జారుకోవడాన్ని గమనించిన వెనుకసీటులో కూర్చున్న 55 ఏళ్ల వ్యక్తి యువతి వెనుకభాగాన్ని తడుముతూ అసభ్యంగా ప్రవర్తించాడు.

వెంటనే మేల్కొన్న యువతి వ్యక్తిని ప్రశ్నించగా మరింత అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో పక్క బోగీలో ఉన్న తన స్నేహితులను పిలవడానికి ప్రయత్నించగా అంతలోపు వ్యక్తి వైట్‌ఫీల్డ్‌ స్టేషన్‌లో దిగి పారిపోయాడు. దీనిపై వైట్‌ఫీల్డ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లగా తమ పరిధిలోకి రాదని అడుగోడి పోలీసులకు ఫిర్యాదు చేయాలంటూ సూచించారు. 

దీంతో అడుగోడి పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని తనకు ఎదురైన అనుభవాన్ని వివరించి కేసు నమోదు చేసుకోవాలంటూ విన్నవించగా వాళ్లు కూడా పట్టించుకోలేదు. దీంతో అక్కడి నుంచి నేరుగా కంటోన్మెంట్‌ పోలీసులకు ఘటన గురించి వివరించి కేసు నమోదు చేసుకోవాలంటూ విన్నవించగా ఫోటో ఉందా, అడ్రస్‌ ఉందా, వ్యక్తి పేరేంటి ఇలా నిర్లక్ష్యంగా ప్రశ్నలు వేసి కేసు నమోదు చేసుకోవానికి నిరాకరించారంటూ ఫేస్‌బుక్‌లో బాధను వ్యక్తం చేశారు. ఫేస్‌బుక్‌ పోస్ట్‌ను కేంద్ర రైల్వేశాఖతో పాటు మహిళ శిశు సంక్షేమశాఖకు కూడా ట్యాగ్‌ చేశారు.