కరోనా మహమ్మారి దేశంలో విలయతాండవం చేస్తోంది. లక్షల మందిని కరోనా కాటు వేస్తోంది. ఈ నేపథ్యంలో..చాలా మంది తమకు తొలిసారి కరోనా వచ్చింది కదా.. రెండోసారి రాదులే అనే భ్రమలో ఉండిపోతున్నారు. అయితే.. రెండోసారి కూడా కరోనా కాటు తప్పదని.. ముఖ్యంగా యువత మీదే ఈ ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఒకసారి కరోనా సోకిన యువతకు.. మళ్లీ ఆ వైరస్‌ సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని లాన్సెంట్‌ రెస్పిరేటరీ మెడిసిన్‌ జర్నల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం స్పష్టం చేసింది. మొదటి సారి ఇన్ఫెక్షన్‌ సోకినప్పుడు ఉండే యాంటీబాడీలు ఎక్కువ కాలం ఉండడం లేదని, పైగా.. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో రీ-ఇన్ఫెక్షన్‌ అవకాశాలు ఎక్కువ అని పేర్కొంది. 

అమెరికా నౌకాదళానికి చెందిన 18-20 ఏళ్ల మధ్య వయసున్న 3,000 మంది యువ రిక్రూటర్లపై మౌంట్‌ సినాయ్‌లోని ఇకాన్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం చేశారు. వీరిలో 189 మందికి రెండు సార్లు కరోనా సోకిందని గుర్తించారు. రెండో సారి వైరస్‌ సోకినప్పుడు చాలా మందిలో లక్షణాలు లేవని పేర్కొన్నారు. 

ఇలాంటి వారి నుంచి ఇతరులకు వైరస్‌ వ్యాప్తిచెందే ప్రమాదముందన్నారు. మొదటిసారి కరోనా వచ్చినప్పుడు ఏర్పడ్డ యాంటీబాడీలు ఎక్కువ కాలం ఉండకపోవడం, రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడం వంటి కారణాలు రెండో సారి ఇన్ఫెక్షన్‌కు దోహదపడుతున్నాయని.. ఈ సమస్యకు వ్యాక్సిన్‌ తీసుకోవడం ఒక్కటే పరిష్కారమని పేర్కొన్నారు.