రద్దీరోడ్డుపై డేంజరస్ బైక్ స్టంట్స్... యువ నటుడికి యాక్సిడెంట్, పరిస్థితి సీరియస్ (వీడియో)
బైక్ స్టంట్స్ తో పాపులర్ అయిన ఓ మోటో వ్లాగర్ అదేే బైక్ తో రోడ్డుప్రమాదానికి గురయి ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్ పాలయ్యాడు. ఈ దుర్ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.

కోయంబత్తూర్ : కత్తి పట్టినవాడు అదే కత్తికి బలవుతాడని అంటుంటారు. ఇలాగే బైక్ పై సాహసోపేత స్టంట్స్ చేసే మోటో వ్లాగర్ రోడ్డు ప్రమాదానికి గురయి హాస్పిటల్ పాలయిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన టిటిఎఫ్ వాసన్ తమిళ స్టార్ హీరో అజిత్ కు పెద్ద ఫ్యాన్. తన అభిమాన హీరో మాదిరిగానే బైక్ రైడింగ్ అంటే అతడికి పిచ్చి. దీంతో మోటో వ్లాగర్ గా మారిపోయి వీడియోలు యూట్యూబ్ లో పెట్టేవాడు. బైక్ స్టంట్స్ ఇష్టపడేవారు వాసన్ యూట్యూబ్ ఛానల్ 'ట్విన్ థ్రాట్లర్స్' ను ఆదరించడంతో అతడు బాగా పాపులర్ అయ్యాడు. 3.2 మిలియన్ల సబ్‌స్క్రైబర్లతో అతడి యూట్యూబ్ ఛానల్ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.
ప్రమాదకరమైన బైక్ స్టంట్స్, వివాదాలతో నిత్యం వార్తల్లో వుండే వాసన్ తాజాగా సినీ హీరోగా మారాడు. 'మంజల్ వీరన్' పేరిట చెల్లం దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న తమిళ మూవీలో వాసన్ నటిస్తున్నాడు. ఇటీవల అతడి పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ కూడా విడుదల చేసారు. ఇలా మోటో వ్లాగర్, యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, సినీ నటుడిగా మంచి జోరుమీదున్న సమయంలో వాసన్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు.
Read More కందుల జాహ్నవి మృతిపై పోలీసు అనుచిత వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన అమెరికా మేయర్
ఆదివారం బైక్ తీసుకుని కాంచీపురం సమీపంలో రద్దీగా వుండే రోడ్లపై స్టంట్స్ చేయడానికి వెళ్లాడు. ఇలా చెన్నై-బెంగళూరు హైవే సర్వీస్ రోడ్డుపై బైక్ ను మితిమీరిన వేగంతో నడిపిస్తూ స్టంట్స్ చేస్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. బైక్ ముందు టైర్ ను అమాంతం గాల్లో వుంచి స్టంట్ చేస్తుండగా అదుపుతప్పి రోడ్డుపక్కకు దూసుకెళ్లింది. మంచి స్పీడ్ లో వుండగా ప్రమాదం జరగడంతో వాసన్ తీవ్రంగా గాయపడ్డాడు.
రోడ్డు పక్కన గాయాలతో పడివున్న వాసన్ కు సహాయం చేసిన కొందరు హాస్పిటల్ కు తరలించారు. అతడికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు.గతంలోనూ ఇలా బైక్ తో స్టంట్స్ చేస్తూ ప్రమాదానికి గురయినప్పటికి చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాడు వాసన్. కానీ ప్రస్తుతం తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.
ప్రమాదానికి ముందు అతడు బైక్ తో స్టంట్స్ చేస్తున్న వీడియోలు బయటకు వచ్చాయి. ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అతడు త్వరగా కోలుకోవాలని కుటుంబసభ్యులు, అభిమానులు కోరుకుంటున్నారు.