చనిపోయిన అన్న ప్రియురాలిపైనే వేధింపులకు పాల్పడ్డాడో తమ్ముడు. ఈ అమానుష ఘటన మహారాష్ట్రలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన కోరిక తీర్చకుంటే అన్నతో కలిసున్న వీడియోలు బైట పెడతానంటూ బ్లాక్ మెయిల్ చేసి చివరికి జైలు పాలయ్యాడు. 

వివరాల్లోకి వెడితే.. మహారాష్ట్రలోని ముంబైలోని మేఘ్‌వాడి ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల యువతి, ఓ యువకుడు ప్రేమించుకున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో ఆ యువకుడికి హార్ట్ ఎటాక్ వచ్చింది. దీంతో అర్ధాంతరంగా చనిపోయాడు. ఇతడికి ఓ తమ్ముడున్నాడు. 

అన్న మరణం తరువాత అతని సెల్ ఫోన్ తమ్ముడు వాడుతున్నాడు. ఆ ఫోన్ లో అన్న, తన ప్రియురాలి ఫొటోలు, వీడియోలు తమ్ముడు చూశాడు. దీంతో తమ్ముడి మైండ్ లో పిచ్చి ఆలోచనలు వచ్చాయి. అంతే ఆ యువతికి కాల్ చేసి వేధించడం మొదలుపెట్టాడు. 

తన కోర్కెలు తీర్చకపోతే వీడియోలను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తానంటూ భయపెట్టసాగాడు. ఎన్నిసార్లు చెప్పినా, నిరాకరించినా అతని వేధింపులు తగ్గలేదు. దీంతో విసిగిపోయిన యువతి పోలీసులను ఆశ్రయించింది.

యువకుడిపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్దనుంచి సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు.