దేవీ నవరాత్రుల వేళ యోగి సర్కార్ 'మిషన్ శక్తి' ... ఏమిటీ ప్రోగ్రామ్?

ఉత్తరప్రదేశ్‌లో మహిళల భద్రత, సాధికారత కోసం యోగి ప్రభుత్వం 'మిషన్ శక్తి' కాార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఇందులో భాగంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారంటే... 

Yogi Government's Mission Shakti 5: Empowering Women and Promoting Safety in Uttar Pradesh AKP

లక్నో : మహిళల భద్రత, గౌరవం, స్వావలంబనకు కట్టుబడి ఉన్న యోగి ప్రభుత్వం  'మిషన్ శక్తి' కార్యక్రమాన్ని చేపడుతోంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ మిషన్‌ను మరింత ప్రభావవంతం చేయడానికి, మహిళలకు మరింత సాధికారత కల్పించడానికి శారదీయ నవరాత్రుల వేళ ఐదవ దశను ప్రారంభించనున్నారు. ఇలా నవరాత్రుల్లో ప్రారంభించిన మిషన్ శక్తి కార్యక్రమాలు డిసెంబర్ వరకు కొనసాగనున్నాయి. 

 ఈ కార్యక్రమాల్లో మహిళలతో పాటు పిల్లలను కూడా భాగస్వాములను చేశారు. మిషన్ శక్తిలో భాగంగా అంతర్జాతీయ బాలికా దినోత్సవం, ఆపరేషన్ ముక్తి, బాల కార్నివాల్, వీరాంగన దినోత్సవం, స్వావలంబన శిబిరాలు వంటి అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఈ కార్యక్రమాల ఉద్దేశ్యం రాష్ట్రంలో అమలులో ఉన్న వివిధ పథకాలు, సేవల గురించి అవగాహన కల్పించడంతో పాటు వాటి ద్వారా మహిళలు ప్రయోజనం పొందేలా చూడటం.

అక్టోబర్ 11 వరకు అంతర్జాతీయ బాలికా దినోత్సవ వేడుకలు

మహిళా,  శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మిషన్ శక్తిలో భాగంగా అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు నిర్వహించే కార్యక్రమాల వివరాలను ప్రకటించారు.ఇందులో మొదట అక్టోబర్ 11 వరకు అంతర్జాతీయ బాలికా దినోత్సవ వేడుకలు జరుగుతాయి. లింగ సమానత్వంపై సెమినార్‌తో పాటు విజయవంతమైన మహిళలతో ముఖాముఖి వుంటుంది. ఒక రోజు జిల్లా కలెక్టర్‌గా బాలిక, కుమార్తెల జనన వేడుకలు, బాల్య వివాహాలు, గృహ హింస, కార్యాలయాల్లో మహిళలపై లైంగిక వేధింపులు వంటి అంశాలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తారు. అక్టోబర్ 11న అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి అంగన్‌వాడీ, ప్రభుత్వ బాలికలు లేదా శిశు గృహాలలో ప్రత్యేక కన్యా పూజ, ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహిస్తారు.

 'ఆపరేషన్ ముక్తి'

ఈ నెల 21 నుండి 31 వరకు ఆపరేషన్ ముక్తిని నిర్వహిస్తారు. దీనిలో భాగంగా బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా వారం రోజుల పాటు అవగాహన, రెస్క్యూ కోసం భారీ ప్రచారం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా వివిధ శాఖలు, అధికారుల సమన్వయంతో బాల్య వివాహాలు లేదా బాల కార్మికులను రక్షించడానికి ఆపరేషన్ నిర్వహిస్తారు. రక్షించబడిన పిల్లలందరినీ బాలల సంక్షేమ కమిటీ ముందు హాజరుపరిచి, ఉత్తరప్రదేశ్ బాల సేవా యోజన కిందకు తీసుకువస్తారు.

ఇక నవంబర్ 10 నుండి 14 వరకు బాల కార్నివాల్ నిర్వహిస్తారు. యోగా, ధ్యానంతో పాటు పిల్లలు మహనీయుల జీవితాల ఆధారంగా నాటకాలు, నృత్య ప్రదర్శనలు ఇస్తారు. క్రీడలు, పెయింటింగ్ పోటీలు కూడా నిర్వహిస్తారు. నవంబర్ 14న బాలల దినోత్సవం సందర్భంగా కార్నివాల్ ముగింపు వేడుకల్లో పిల్లల కోసం సిద్ధం చేసిన వివిధ కార్యక్రమాలతో పాటు వృత్తి విద్య, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా పిల్లలు తయారు చేసిన ఉత్పత్తుల ప్రదర్శన ఉంటుంది. పోటీల్లో మొదటి, రెండు, మూడు స్థానాలు సాధించిన పిల్లలకు బహుమతులు అందజేస్తారు.

 'వీరాంగన దినోత్సవం'

నవంబర్ 19న రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వీరాంగన దినోత్సవాన్ని పురస్కరించుకుని సమాజంలో మార్పు కోసం కృషి చేస్తున్న మహిళల స్ఫూర్తిదాయక కథలను వివిధ మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరవేస్తారు. ఈ సందర్భంగా అలాంటి వీరాంగనలను సత్కరిస్తారు, తద్వారా వారు సమాజంలోని ఇతర బాలికలు, మహిళలకు ఆదర్శంగా నిలుస్తారు.

అంతేకాకుండా రాష్ట్రంలోని అన్ని బాలల సంరక్షణా సంస్థలు, మహిళా గృహాలలో ఝాన్సీ వీరాంగన రాణి లక్ష్మీబాయి జీవితంపై వీధి నాటకాలు లేదా కథా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అంతేకాకుండా నవంబర్ 20న అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని బాలల హక్కులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. రాష్ట్ర స్థాయిలో నైపుణ్యాభివృద్ధిలో భాగమైన పిల్లలపై హ్యాండ్‌బుక్, కాఫీ టేబుల్ బుక్‌ను ఆవిష్కరిస్తారు.

'స్వావలంబన శిబిరం'

నవంబర్ 30 నుండి స్వావలంబన శిబిరాలు ప్రారంభమవుతాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివిధ పథకాల (ముఖ్యమంత్రి కన్యా సుమంగళ, ముఖ్యమంత్రి బాల సేవా యోజన, నిరాశ్రిత మహిళా పింఛను, స్పాన్సర్‌షిప్ పథకం) ద్వారా లబ్ధి పొందే కుటుంబాలు, మహిళలు, పిల్లల దరఖాస్తులన్నింటినీ ఈ వన్ విండో శిబిరాల ద్వారా పూర్తి చేస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలకు సంబంధించిన పథకాలను ప్రచారం చేయడంతో పాటు మహిళలు, బాలికలకు రక్షణ కల్పించే ప్రధాన చట్టాలు, నిబంధనల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తారు. అదేవిధంగా డిసెంబర్ 4న అన్ని జిల్లాల్లో కార్యాలయాల్లో మహిళలపై లైంగిక వేధింపుల చట్టం 2013 కింద ఏర్పాటైన స్థానిక, అంతర్గత ఫిర్యాదు కమిటీలకు శిక్షణ ఇస్తారు.

డిసెంబర్ 6న జిల్లా స్థాయిలో లైంగిక వేధింపులు, లింగ అసమానత, గృహ హింస, కన్యా పింఛను, కార్యాలయాల్లో లైంగిక వేధింపులు, వరకట్న వేధింపులకు గురైన మహిళలకు రక్షణ, భద్రతా ఏర్పాట్లు, సూచనలు, సహాయం అందించడం కోసం జిల్లా కలెక్టర్‌తో రెండు గంటల పాటు పరస్పర చర్చా కార్యక్రమం నిర్వహిస్తారు. అంతేకాకుండా డిసెంబర్ 10న ప్రతి గ్రామ పంచాయతీ స్థాయిలో మహిళా, బాల సభలను నిర్వహించి మహిళలు, పిల్లలకు సంబంధించిన సున్నితమైన అంశాలపై చర్చిస్తారు.

డిసెంబర్ 16న రాష్ట్రంలోని అన్ని వన్ స్టాప్ సెంటర్లలో ప్రజాప్రతినిధులతో కలిసి శాఖా పథకాలు, కార్యక్రమాలపై చర్చిస్తారు. అంతేకాదు పోక్సో చట్టం కింద బాధిత పిల్లలకు, ముఖ్యంగా బాలికలకు చట్టపరమైన ప్రక్రియలో మద్దతు ఇవ్వడానికి దాదాపు 300 మంది సహాయకులకు నివాస శిక్షణ కూడా ఇస్తారు.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios