యూపీ ప్రజలకు సీఎం యోగి భరోసా ... అధికారులకు కీలక ఆదేశాలు
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వైద్యారోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య విభాగాల పనితీరును సమీక్షా సమావేశం నిర్వహించి కీలక సూచనలు చేశారు.
ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ప్రధాని మోదీ అడుగుజాడల్లో నడుస్తూ రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చినట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. వైద్య సౌకర్యాలను మెరుగుపర్చడంతో పాటు ప్రభుత్వ హాస్పిటల్స్ లో మౌలిక సదుపాయాలను నిరంతరం పెంచుకుంటూ పోతున్నామని అన్నారు. దీంతో నేడు యూపీలోని 64 జిల్లాల్లో వైద్య కళాశాలలు అందుబాటులో వచ్చాయన్నారు. త్వరలోనే మిగిలిన జిల్లాల్లో కూడా వైద్య కళాశాలలు ఏర్పాటు చేయనున్నట్లు సీఎం యోగి ప్రకటించారు.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ వృద్దుల ఆరోగ్యం విషయంలో తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదని అన్నారు. 70 ఏళ్లు పైబడిన వయో వృద్దులకు కూడా ఆయుష్మాన్ భారత్ ద్వారా వైద్యం అందించాలన్న నిర్ణయం అద్భుతమన్నారు. రాాష్ట్ర ప్రజలందరికీ ఈ ఆయుష్మాన్ కార్డులు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు అర్హులైన వారందరికీ ఆయుష్మాన్ కార్డులు అందేలా తక్షణమే అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం యోగి ఆదేశించారు.
2017లో అధికారంలోకి రాగానే డెంగ్యూ, మలేరియా, ఎన్సెఫాలిటిస్, ప్రాణాంతక జ్వరం, చికున్ గున్యా వంటి అంటువ్యాధుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు ప్రారంభించామని... ఈ ఫలితాలు ఇప్పుడు ఎలా వున్నాయో అందరికీ తెలుసన్నారు. ఈ సత్ఫలితాల నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఏప్రిల్, జూలై, అక్టోబర్ నెలల్లో అన్ని విభాగాల సమన్వయంతో అంటువ్యాధుల నియంత్రణకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు. వీటి ద్వారా ఆరోగ్య కార్యకర్తలు ప్రజలకు అంటువ్యాధులపై అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు.
రానున్న రెండు నెలలు అంటువ్యాధుల తీవ్రత దృష్ట్యా చాలా కీలకం...కాబట్టి ప్రత్యేక కార్యక్రమాల ద్వారా అంటువ్యాధుల నివారణ అవసరం అన్నారు. ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు అన్ని విభాగాల సమన్వయంతో ఆరోగ్య శాఖ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. జిల్లాల్లో బ్లడ్ బ్యాంకులు, బ్లడ్ సెపరేషన్ యూనిట్లు పూర్తి స్థాయిలో పనిచేసేలా చూడాలన్నారు. సెప్టెంబర్ 17న ప్రారంభమైన స్వచ్ఛతా పక్షోత్సవాలు అక్టోబర్ 2 వరకు కొనసాగుతాయి... వీటి ద్వారా ప్రజలకు పరిశుభ్రత, పారిశుధ్యంపై అవగాహన కల్పించాలని సీఎం యోగి సూచించారు.
ఘజియాబాద్ జిల్లాలో ఎయిమ్స్ సాటిలైట్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి యోగి ప్రకటించారు. దీనికి సంబంధించిన అన్ని ప్రక్రియలను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా బలరాంపూర్‌లో కేజీఎంయు సాటిలైట్ సెంటర్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచించారు.
-అన్ని వైద్య కళాశాలలు, జిల్లా ఆసుపత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రతను మెరుగుపరచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రభుత్వ ఆశయం మేరకు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, ఇతర సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వచ్చే రోగుల పట్ల వైద్యులు సున్నితంగా వ్యవహరించాలని సూచించారు. 102, 108 అంబులెన్స్ సేవలు బాగా పనిచేస్తున్నాయని, వాటి పనితీరును మరింత మెరుగుపరచాలని సూచించారు. అన్ని ఆసుపత్రుల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు.
వైద్య ఆరోగ్య శాఖ, వైద్య విద్య విభాగాలు ప్రిన్సిపాల్స్, వైద్యులు, ఇతర సిబ్బంది నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మంచి వేతనాలు, పనితీరు ఆధారంగా ప్రోత్సాహకాలు ఇచ్చి నిపుణులైన వైద్యులను నియమించుకోవాలని సూచించారు.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి అన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల మెరుగైన పనితీరు దృష్ట్యా వాటి రిజిస్ట్రేషన్ వ్యవధిని కనీసం మూడు నుంచి ఐదు సంవత్సరాలకు పెంచాలని సూచించారు.
అన్ని వైద్య కళాశాలలు వైద్య పరికరాలైన ఎక్స్‌రే మిషన్లు, అల్ట్రాసౌండ్ మిషన్లు, సిటీ స్కాన్లు, ఎంఆర్ఐ మిషన్లు, లిఫ్టులు మొదలైన వాటి నిర్వహణ కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. కరోనా సమయంలో హెల్త్ వాలంటీర్లు నేర్చుకున్న అనుభవాలను వినియోగించుకోవాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్ అధికారులను ఆదేశించారు.