ఉత్తర ప్రదేశ్ ప్రజలకు దసరా కానుక ... సీఎం యోగి ఆదిత్యనాథ్ నిర్ణయమిదే
దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించే పనిలో పడింది. ముఖ్యంగా ప్రజలకు అసౌకర్యం కలగకుండా వెంటనే రోడ్ల మరమ్మతులు చేపట్టేందుకు సిద్దమయ్యింది.
లక్నో : వరుస పండగల వేళ ఉత్తర ప్రదేశ్ ప్రజల కోసం యోగి ఆదిత్యనాథ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే దసరా, దీపావళి పండగల నాటికి రాష్ట్రంలోని రోడ్లన్నింటిని అద్దాల్లా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు సీఎం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే రహదారులను గుంతలు లేకుండా మార్చాలని... ఇందుకోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. వచ్చే నెల అక్టోబర్ 10 తర్వాత రాష్ట్రంలో ఎక్కడా గుంతలతో కూడిన రోడ్లు కనిపించకూడదని సీఎం యోగి ఆదేశించారు.
ఇవాళ (మంగళవారం) వివిధ శాఖల అధికారులతో సీఎం యోగి సమావేశమయ్యారు. ఈ సందర్భంగానే రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై అధికారులతో చర్చించారు. ఇప్పుడు పండుగలు, వేడుకల కోసం రాష్ట్రప్రజలు ఎక్కువగా ప్రయాణాలు చేస్తారని గుర్తుచేసారు. అలాగే ఈ సమయంలోనే పెద్ద సంఖ్యలో విదేశీ పర్యాటకులు కూడా వస్తారని అన్నారు. కాబట్టి యూపీకి విచ్చేసే ప్రతి ఒక్కరికీ రోడ్డు ప్రయాణం హాయిగా, ఆహ్లాదకరంగా వుండాలని... అది మనందరి బాధ్యత అని అన్నారు. కాబట్టి గుంతలు లేకుండా రోడ్ల మరమ్మతు పనులు చేపట్టాలి... ఆ పనులు నాణ్యతతో వుండాలని సీఎం సూచించారు.
వ్యవసాయ పనులకోసం, తమ పంటను తరలించేందుకు రైతులే రోడ్లకు ఎక్కువగా వినియోగిస్తారు... వారికి ఎలాంటి ఇబ్బందులు తలెడకుండా చూసుకోవాలని సీఎం యోగి సూచించారు. ఎఫ్‌డిఆర్ పద్ధతిలో రోడ్లు నిర్మించాలని... తద్వారా సహజ వనరులు, డబ్బు, సమయం ఆదా అవుతుందన్నారు. పని నాణ్యత కూడా మెరుగుపడుతుందని సూచించారు. మార్కెట్ కమిటీ పరిధిలోని అన్ని రోడ్ల మరమ్మతులు, డ్రైనేజీ పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని... నాణ్యత పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. అదేవిధంగా ఎన్‌హెచ్‌ఏఐ అధికారులతో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. హైవే నిర్మాణం పూర్తయ్యే వరకు టోల్ ట్యాక్స్ వసూలు చేయవద్దని ఆదేశించారు.
రోడ్లు గుంతలు లేకుండా చేసేందుకు రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను సీఎం యోగి పరిశీలించారు. ఈ క్రమంలోనే రోడ్ల నిర్మాణం, మరమ్మతులకు నిధుల కొరత లేదన్నారు. అన్ని శాఖలు మెరుగైన ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు. రోడ్డు నిర్మించిన ఏజెన్సీ,కాంట్రాక్టర్ తదుపరి 5 సంవత్సరాల పాటు ఆ రోడ్డు నిర్వహణ బాధ్యతను తీసుకునేలా చూడాలని అన్ని శాఖలను ఆదేశించారు. ఈ విషయాన్ని నిబంధనలు, షరతుల్లో స్పష్టంగా పేర్కొనాలని సూచించారు.
మంత్రులు, అధికారులు క్షేత్రస్థాయిలో సడన్ తనిఖీలు చేపడుతూ రోడ్ల నిర్మాణ పనులు, నాణ్యతను పరిశీలించాలని సీఎం సూచించారు. మనుషులను ఉపయోగించిన నాణ్యత లేకుండా, నెమ్మదిగా రోడ్లువేయడం కంటే యాంత్రిక పద్ధతిలో వేగంగా పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. అన్ని శాఖల వద్ద రోడ్లు మరమ్మతు చేయడానికి తగిన పరికరాలు ఉండాలని... రోడ్లలోని గుంతలు పూడ్చే పనిని ఆటోమేటెడ్ పద్ధతిలో చేపట్టాలని సూచించారు.
రోడ్లపై చేపట్టే నిర్లక్ష్యపు పనుల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేసారు. కాబట్టి రోడ్లపై మురుగునీటి పైపులైన్లు, ఇతర అవసరాల కోసం తవ్విన గుంతలను వెంటనే పనులు పూర్తిచేసి పూడ్చివేయాలని సూచించారు. రోడ్లపై ఎత్తైన స్పీడ్ బ్రేకర్ల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది...కాబట్టి టేబుల్ టాప్ స్పీడ్ బ్రేకర్లను నిర్మించాలని సూచించారు.
గుంతలు లేకుండా చేసేందుకు, కొత్త రోడ్ల నిర్మాణానికి సంబంధించిన కార్యక్రమాలను జియో ట్యాగింగ్ చేయాలని సీఎం యోగి సూచించారు. దీనిని పీఎం గతిశక్తి పోర్టల్‌తో అనుసంధానించాలని, అదే తరహాలో మన రాష్ట్రానికి కూడా ప్రత్యేక పోర్టల్‌ను అభివృద్ధి చేయాలని సూచించారు. తద్వారా పనుల నాణ్యతను నిరంతరం పర్యవేక్షించవచ్చని పేర్కొన్నారు. పండుగలు, వేడుకల సందర్భంగా ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణించేలా ఎక్స్‌ప్రెస్‌వేల మరమ్మతు పనులు చేపట్టాలని... ఎంపీ, ఎమ్మెల్యే నిధులతో నిర్మించిన రోడ్ల మరమ్మతు కోసం కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని సూచించారు.
చక్కెర కర్మాగారాల కమిటీలు, పాఠశాల భవనాల మరమ్మతులను చక్కెర పరిశ్రమ శాఖ చేపట్టాలని ముఖ్యమంత్రి అన్నారు. గ్రామ సచివాలయాలను దేశానికే ఆదర్శంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించిందని, గ్రామ సచివాలయాల తరహాలోనే చక్కెర కర్మాగారాల కమిటీ కార్యాలయాలను కూడా అప్‌గ్రేడ్ చేయాలని, రైతులకు ఉపయోగపడే సమాచారాన్ని డిస్‌ప్లే బోర్డులపై ప్రదర్శించాలని, రైతుల సందేహాలను నివృత్తి చేయాలని సూచించారు.
రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో మార్కెట్ కమిటీలు, పారిశ్రామిక సంస్థలు ఉన్న ప్రాంతాల్లో సీఎస్ఆర్ నిధులతో తాగునీరు, మరుగుదొడ్లు, క్యాంటీన్లు వంటి వసతులు కల్పించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా స్వయం సహాయక బృందాలను భాగస్వాములను చేయాలన్నారు. మార్కెట్‌లోని క్యాంటీన్ల ద్వారా రైతులకు తక్కువ ధరకే భోజనం అందేలా చూడాలని సూచించారు. , పారిశ్రామిక సంస్థల్లో భద్రతా ఏర్పాట్ల కోసం సీసీటీవీలు, స్ట్రీట్ లైట్లు, పారిశుధ్య నిర్వహణ వంటి వాటిని ఏర్పాటు చేయాలని సూచించారు.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోని ప్రధాన ప్రాంతాల్లో స్మార్ట్ రోడ్లను అభివృద్ధి చేయాలని, స్మార్ట్ రోడ్లపై ఒకే రకమైన లైట్లను ఏర్పాటు చేయాలని, నగర అభివృద్ధి శాఖ కూడా లైటింగ్ పై ప్రత్యేక శ్రద్ద చూపాలని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలో పట్టణీకరణ క్రమంగా పెరుగుతోందని, అక్రమ కాలనీల అభివృద్ధిని అనుమతించవద్దని సూచించారు. రోడ్లు, విద్యుత్, నీరు వంటి ప్రాథమిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చిన తర్వాతే కొత్త కాలనీలను అప్పగించాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సూచించారు.