లక్నో: 2022 ఎన్నికల్లో పెద్ద పార్టీలతో పొత్తు ఉండదని సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ప్రకటించారు.  బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీల పేర్లు ఎత్తకుండా సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ కీలక ప్రకటన చేశారు.పెద్ద పార్టీలతో అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు ఉండదని సమాజ్ వాద్ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తేల్చి చెప్పారు. చిన్న పార్టీలతో కలిసి పోటీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. 

ప్రగతిశీల సమాజ్ వాదీ పార్టీతో పొత్తు ఉంటుందని ఆయన చెప్పారు. 2019 లో సమాజ్ వాదీ పార్టీకి గుడ్ బై చెప్పిన బాబాయ్ శివపాల్ యాదవ్ ప్రగతిశీల సమాజ్ వాదీ పార్టీని ఏర్పాటు చేశారు.  

జస్వంత్ నగర్ లో శివపాల్ యాదవ్ కోసం సమాజ్ వాదీ పార్టీ పోటీ చేయలేదన్నారు. అంతేకాదు తమ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైతే శివపాల్ యాదవ్ కు కేబినెట్ లో చోటు కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు.

లక్నో, ఏటవాలలో పార్టీ ప్రముఖులతో అఖిలేష్ సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రంలో అభివృద్ధిని బీజేపీ శిలాఫలాకాలకు మాత్రమే పరిమితం చేసిందని ఆయన విమర్శించారు. 

2017 ఎన్నికల్లో ఎస్పీ, కాంగ్రెస్ కూటమి చాలా తక్కువ స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్ ఏడు సీట్లు గెలుచుకోగా, ఎస్పీ 47 సీట్లలో గెలిచింది. బీజేపీ 312 సీట్లను కైవసం చేసుకొన్న విషయం తెలిసిందే.