ప్రతిరోజు రాత్రి హాయిగా నిద్రపోతున్న ఓ వ్యక్తికి ఒక బెడ్ నుంచి భరించలేనంత దుర్వాసన వచ్చింది. దీంతో ఏ ఎలుకైనా చచ్చిందా అన్న అనుమానంతో బెడ్ పైకెత్తి చూడగా షాక్‌కు గురయ్యాడు. బెడ్ కింద ఉండే బాక్స్‌లో ఓ మహిళ మృతదేహం కనిపించడంతో ఆయన పోలీసులకు సమాచారం అందించడం వాళ్ల దర్యాప్తులో అసలు నిజాలు వెలుగులోకి రావడం జరిగిపోయింది.  

బీహార్‌లోని గయకి చెందిన దినేశ్ కుమార్ అనే టీ వ్యాపారి వద్ద రాజేశ్ కుమార్ అనే వ్యక్తి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. రాజేశ్ తన భార్య బబితతో కలిసి యజమానికి చెందిన ఇంట్లోనే అద్దెకు ఉంటున్నాడు. కాగా, ఇటీవల ఏదో పని మీద దినేశ్ దగ్గర్లోని ఓ పట్టణానికి వెళుతూ ఇంటి తాళాలు రాజేశ్‌కు ఇచ్చాడు.

వారం తర్వాత ఇంటికి వచ్చిన దినేశ్ ఎప్పటిలాగానే తన బెడ్‌పై పడుకున్నాడు. ఈ రోజు ఏదో వాసనగా అనిపించినప్పటికీ అలాగే పడుకున్నాడు. ప్రతిరోజు రాత్రి పడుకునే సమయానికి దుర్వాసన రావడం దానిని ఏమాత్రం పట్టించుకోకుండా దినేశ్ నిద్రించడం జరుగుతూ ఉంది.

అయితే 5 రోజుల తర్వాత భరించరాని దుర్వాసన రావడంతో దినేశ్ తన బెడ్‌ను ఓపెన్ చేసి చూసి షాకయ్యాడు. బెడ్ కింద కుళ్లిన స్థితిన మహిళ మృతదేహం కనిపించింది. ఆ మృతదేహాన్ని తన డ్రైవర్ రాజేశ్ భార్య బబితగా గుర్తించాడు.

కేసును అనుమానాస్పద మృతిగా నమోదు చేసుకున్న పోలీసులు ...ఆమెను భర్త రాజేశే చంపి ఉంటాడని భావిస్తున్నారు. మృతురాలి తండ్రి కూడా తమ కుమార్తెను రాజేశే హత్య చేశాడని ఆరోపిస్తున్నారు. కాగా, విషయం వెలుగులోకి వచ్చిన నాటి నుంచి రాజేశ్ జాడ లేకపోవడంతో పోలీసుల అనుమానం బలపడింది. దీంతో పరారీలో ఉన్న అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.