మహారాష్ట్ర రాష్ట్ర మంత్రి ధనుంజయ్ ముండే తనపై గత కొంతకాలంగా అత్యాచారానికి పాల్పడుతున్నారంటూ ఇటీవల ఓ మహిళ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. కాగా... ఈ ఘటన  దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. మంత్రిపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అయితే.. తాజాగా సదరు మహిళ ఈ కేసు విషయంలో వెనక్కి తగ్గింది. తాను పెట్టిన కేసును వెనక్కి తీసుకోవడం గమనార్హం.

ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే.. మంత్రి ధనుంజయ్ ముండే తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు, ఎన్‌సీపీ ఎమ్మెల్యే, మంత్రి ధనుంజయ్ ముండే నుంచి తనకు ప్రాణహాని ఉందని సోషల్ మీడియాలో ఆరోపించింది. అయితే, ఈ ఆరోపణలను మంత్రి ధనుంజయ్ ముండే కొట్టిపారేశారు. ఫేస్‌బుక్ ద్వారా స్పందించిన ఆయన.. ఆమె తనను బ్లాక్‌మెయిల్ చేస్తోందని, ఎందుకంటే తాను ఆ మహిళ సోదరితో రిలేషన్‌షిప్‌లో ఉన్నానని అన్నారు.

‘పోలీసులకు ఫిర్యాదుచేసిన మహిళ సోదరితో తాను చాలా ఏళ్లుగా సహజీవనం చేస్తున్నాను.. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.. ఆమెను నా భార్యగా అంగీకరించాను’ అని అన్నారు. మంత్రిపై అత్యాచార ఆరోపణలు రావడంతో ఆయన తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్ష బీజేపీ డిమాండ్ చేస్తూ వస్తోంది. కాగా.. అనూహ్యంగా సదరు మహిళ కేసు వెనక్కి తీసుకోవడం గమనార్హం.