ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయంలోకి ప్రవేశించి.. అయ్యప్ప స్వామిని దర్శించుకున్న ఓ మహిళకు.. ఆమె అత్త షాకిచ్చింది. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలకు అనుమతిస్తూ.. గతేడాది సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత తొలిసారి ఇద్దరు మహిళలు స్వామివారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. కాగా వారిలో ఒకరైన కనకదుర్గ పై దాడి జరిగింది. 

సోమవారం ఇంటికి తిరిగి వస్తుండగా ఆమెపై ఈ దాడి జరిగింది. సొంత అత్తగారే కనకదుర్గ తలపై బలంగా కొట్టడం గమనార్హం. ప్రస్తుతం మల్లాపురం జిల్లాలోని ఓ ఆసుపత్రిలో కనకుదుర్గ చికిత్స పొందుతోందని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం కనకదుర్గ ఆరోగ్య పరిస్థితి నిలికడగానే ఉందని చెబుతున్నారు.

గత జనవరి 2న శబరిమల ఆలయంలోకి 39 ఏళ్ల కనకదుర్గ, 40 ఏళ్ల బిందు  ప్రవేశించిన సంగతి తెలిసిందే. దీంతో ఆలయం అపవిత్రమైందంటూ ఆలయం తలుపులు మూసేసిన పూజారులు సంప్రోక్షణ అనంతరం గుడి తలుపులు తెరిచారు. ఈ ఘటన తీవ్ర వివాదానికి దారితీసింది.  కోజికోడ్‌లోని కనకదుర్గ ఇంటిముందు నిరసనలు కూడా జరిగాయి. దీంతో బిందు, కనకదుర్గ గత రెండు వారాలుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అక్కడ్నించే వారు తమకు బెదరింపులు వస్తున్నాయని, అధికారులు తమకు తగిన భద్రత కల్పించాలని కూడా కోరారు. ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది.