యూపీలో దారుణం జరిగింది. రైల్వే స్టేషన్ పరిధిలోని పబ్లిక్ టాయిలెట్ లో ఓ మహిళపై ఓ వ్యక్తి లైంగిక దాడికి ఒడిగట్టాడు. భార్యను ఒంటరిగా నిలబెట్టి భర్త టీ కోసం బయటకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 

మ‌హిళల ర‌క్ష‌ణ కోసం కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఎన్ని చ‌ట్టాలు తెచ్చినా.. వారిపై లైంగిక దాడులు ఆగ‌డం లేదు. నిత్యం ఎక్క‌డో ఒక చోట వారిపై దాడులు జ‌రుగుతూనే ఉన్నాయి. చిన్నారులు అని కూడా చూడ‌కుండా వారిపై అత్యాచారాలకు పాల్ప‌డుతున్నారు. మ‌హిళ‌లు క‌నిపిస్తే చాలు మ‌గాళ్లు మృగాళ్లుగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. కామంతో వెంట‌ప‌డి వేధిస్తున్నారు. తాజాగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్ (Uttar Pradesh)లో ఓ దారుణ ఘ‌ట‌న జ‌రిగింది. రైల్వే స్టేష‌న్ ప‌బ్లిక్ టాయిలెట్ లో ఓ మ‌హిళ పై ఓ వ్య‌క్తి అత్యాచారం చేశాడు. 

ఈ ఘ‌ట‌న యూపీలోని ప్ర‌తాప్ గ‌డ్ రైల్వే స్టేష‌న్ (Pratapgarh railway station) లో మార్చి 19వ తేదీన జరిగింది. దీనిపై ఎఫ్ఐఆర్ న‌మోదు చేశామ‌ని పోలీసులు వెల్ల‌డించారు. కొత్వాలి పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) RN రాయ్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. 20 ఏళ్ల బాధిత మ‌హిళ మార్చి 19వ తేదీన ఉద‌యం త‌న భ‌ర్త‌తో క‌లిసి రైల్వే స్టేష‌న్ కు వ‌చ్చింది. ఓ రైలు రాక‌కోసం అక్క‌డ ఎదురు చూస్తున్నారు. అయితే ఈ లోపు భ‌ర్త టీ తీసుకురావ‌డానికి భార్య‌ను అక్క‌డ ఒంట‌రిగా వ‌దిలి వెళ్లాడు. ఆ స‌మ‌యంలో ‘అన్నా’ అనే వ్యక్తి మ‌హిళ వ‌ద్ద‌కు వ‌చ్చాడు. పార్కింగ్ స్టాండ్ (parking stand) స‌మీపంలో శుభ్ర‌మైన టాయిలెట్ ఉంద‌ని, దానిని ఉప‌యోగించుకోవ‌చ్చ‌ని సూచించాడు. ఆ టాయిలెట్ కు సంబంధించిన ఓ తాళం చెవి ఆమెకు ఇచ్చాడు. 

ఆమె ఆ టాయిలెట్ కీ తీసుకొని లోప‌లికి ప్ర‌వేశించింది. వెంట‌నే నిందితుడు కూడా లోపలికి ప్ర‌వేశించి మ‌హిళ‌పై అఘాయిత్యానికి పాల్ప‌డ్డాడు. ఆమైపై లైంగిక దాడికి ఒడిగ‌ట్టాడు. అనంత‌రం అక్క‌డి నుంచి పారిపోయాడు. భార్య‌ను భ‌ర్త ర‌క్షించి పోలీసుల‌కు స‌మాచారం అందించాడు. దీంతో మ‌హిళ ఫిర్యాదు మేర‌కు పోలీసులు నిందితుడిపై ఐపీసీ సెక్ష‌న్ 376 సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేసేందుకు రెండు బృందాలు గాలిస్తున్నాయి. 

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో ఈ నెల మొద‌టి వారంలో ఇలాంటి ఘ‌టనే జ‌రిగింది. ఓ కాలేజీ స్టూడెంట్ ను సామూహికంగా అత్యాచారం చేశారు. దీనికి సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. మీరట్ (Meerut)లోని సర్ధానా పోలీస్ స్టేషన్ (Sardhana Police Station) ప‌రిధిలో నివాసం ఉండే యువ‌తి ప్ర‌తీ రోజూ ఖటోలీలో ఉండే కాలేజీకి వెళ్లి చ‌దువుకుంటుంది. రోజులాగే కాలేజీకి వెళ్లిన యువ‌తిని ఓ ఐదుగురు వ్య‌క్తులు కారులో కిడ్నాప్ చేశారు. ఆమెను అక్క‌డి నుంచి ఢిల్లీ (delhi) కి తీసుకెళ్లాల‌ని భావించారు. ఢిల్లీకి వెళ్తున్న క్ర‌మంలోనే ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. అనంత‌రం ఆమెను బెదిరించారు. ఈ విష‌యం ఎవ‌రికీ తెలియ‌కూడద‌ని హెచ్చ‌రించారు. అనంత‌రం బాధిత యువ‌తిని వారు మీర‌ట్ కు తీసుకొచ్చి వ‌దిలిపెట్టారు. కాగా కాలేజీకి వెళ్లిన యువ‌తి తిరిగి ఇంటికి రాక‌పోవ‌డంతో కుటుంబ స‌భ్యులు కంగారుప‌డ్డారు. ఆమె కోసం వెత‌క‌డం ప్రారంభించారు. బాధితురాలు కుటుంబ స‌భ్యులకు ఫోన్ చేసి జ‌రిగిన ఘ‌ట‌న గురించి తెలియ‌జేసింది. దీంతో వారు పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేశారు.