ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. తన ప్రియుడితో సహాయంతో ఓ మహిళ తన భర్తను చంపి, శవాన్ని ఇంట్లో పూడ్చిపెట్టింది. ఈ సంఘటన ముంబై పశ్చిమ శివారులోని దహీసార్ లో జరిగినట్లు పోలీసులు మంగళవారంనాడు చెప్పారు. 

మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఆమెను రషీదా షేక్ గా గుర్తించారు. ఆమె ప్రియుడు అమిత్ మిశ్రా పరారీలో ఉన్నాడు. ఈ సంఘటన 12 రోజుల క్రితం జరిగింది. తన కూతురు చూస్తుండగానే మహిళ తన భర్త రయీస్ షేక్ గొంతును పదునైన ఆయుధంతో కోసింది. 

ప్రియుడితో కలిసి ఆమె భర్త శవాన్ని తన గదిలో పూడ్చిపెట్టింది. ఆ తర్వాత ఏమీ ఎరుగనట్లే ఉన్నారు. మృతుడు వస్త్ర దుకాణంలో సేల్స్ మన్ గా పనిచేసేవాడు. వారం రోజులుగా అతను కనిపించడం లేదని పొరుగింటి వ్యక్తి సమాచారం ఇచ్చాడు. 

మృతుడి సోదరుడు ఇంటికి రావడంతో సంఘటన వెలుగు చూసింది. మృతుడి కూతురు బోరున విలపిస్తూ అతనికి విషయం చెప్పింది. పోలీసులు శవాన్ని స్వాధీనం చేసుకోవడానికి సిద్ధపడ్డారు.