వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేకున్నారు. వారి ప్రేమకు గుర్తుగా ఓ కుమారుడు కూడా ఉన్నాడు.  కాగా.. వీరి జీవితంలోకి మరో వ్యక్తి  ప్రవేశించాడు. భర్తని కాదని.. సదరు వివాహిత.. ప్రియుడి మోజులో పడిపోయింది. ప్రేమించిన పెళ్లి చేసుకున్న భర్త కన్నా.. ఆమెకు ప్రియుడే ఎక్కువయ్యాడు. ఈ క్రమంలో.. అడ్డుగా ఉన్నాడని భర్తను చంపేశారు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

గ్రామానికి చెందిన ప్రదీప్‌ (35), భార్య శిల్ప (30) 13 ఏళ్ల కిందట ప్రేమించుకుని పెళ్లాడారు. వారికి 12 ఏళ్ల కొడుకు ఉన్నాడు. దంపతులు సంతోషంగా ఉన్నారు. ఇంతలో మూడేళ్ల కిందట మధు నాయక్‌ (34) అనే వ్యక్తి శిల్పకు పరిచయమయ్యాడు. ఇతను కేఆర్‌ నగరవాసి. స్వయం సేవా సంఘాల వారికి రుణాలను ఇప్పించడం వంటి దళారీ పనులు చేసేవాడు. శిల్ప, మధుల పరిచయం అక్రమ సంబంధానికి దారితీసింది. శిల్ప భర్త ఇంట్లో లేని సమయంలో నేరుగా ఇంటికే వచ్చివెళ్లేవాడు. బయట షికార్లు సరేసరి. ఇది తెలిసి ప్రదీప్‌ భార్యను తీవ్రంగా మందలించగా ఎన్నోసార్లు గొడవలూ జరిగాయి.

తమ ఆనందానికి అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకోవాలని ప్రేయసీప్రియులు పథకం వేశారు. నవంబర్‌ 18వ తేదీన రాత్రి గుట్టుగా భోజనంలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది. దీంతో మత్తులోకి జారుకున్న భర్తను ప్రియునితో కలిసి గొంతు నులిమి చంపింది. తెల్లవారుజామున గుండెపోటుతో చనిపోయాడని శిల్ప ఉత్తుత్తి ఏడుపు ఏడ్చి అనుమానం రాకుండా అంత్యక్రియలు జరిపించింది. అప్పటినుంచి ప్రియుడు మధుతో జల్సాలు చేస్తుండడం చూసి ప్రదీప్‌ బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపి నిజాలు చెప్పించారు. తామే హత్య చేశామని శిల్ప, మధు అంగీకరించారు. అరెస్టు చేసి జిల్లా జైలుకు తరలించారు.