Asianet News TeluguAsianet News Telugu

భర్తతో విడిపోయినా.. అత్తారింట్లో దర్జాగా ఉండొచ్చు!

దేశంలో గృహ హింస ప్రబలంగా ఉందని న్యాయస్థానం పేర్కొంది. ప్రతి రోజు కొంతమంది మహిళలు ఏదో ఒక రూపంలో హింసను ఎదుర్కొంటున్నారని కోర్టు తెలిపింది.

Woman Has Right To Stay At Estranged In-Laws' Home, Says Supreme Court
Author
Hyderabad, First Published Oct 16, 2020, 10:23 AM IST

నూరేళ్లు.. ఒకరి కోసం మరొకరు బతకాలనే ఆశతోనే పెళ్లి చేసుకుంటారు. అయితే.. ఆ పెళ్లి బంధంలో  మనస్పర్థలు వస్తూ ఉంటాయి. వాటిని కొందరు సర్దుకుపోయి జీవిస్తుంటే.. మరికొందరు మాత్రం కలిసి బతకలేమని తీర్మానానికి వచ్చేస్తున్నారు. ఈ క్రమంలోనేవారు కోర్టుకి ఎక్కి విడాకులు తీసుకుంటున్నారు. అయితే... విడాకులు తీసుకున్న తర్వాత ఆ భార్యభర్తల మధ్య ఇక ఎలాంటి బంధం ఉండదు. అక్కడి వరకు బాగానే ఉంది. కానీ.. అప్పటి వరకు అత్తారింటితో, ఆ ఇంట్లోని మనుషులతో కూడా ఎలాంటి బంధం లేనట్లేనా..? వారిని వదులుకోవాల్సిందేనా అంటే.. అస్సలు లేదంటోందని న్యాయస్థానం. భర్తతో విడిపోయినా.. అత్తారింట్లో.. ఆ ఇంటి మనుషులతో కలిసి బతికే అవకాశం ఉందని తాజాగా న్యాయస్థానం పేర్కొంది. ఈ మేరకు సుప్రీం కోర్టు ఓ మహిళ విషయంలో తీర్పు వెల్లడించింది.

పూర్తి వివరాల్లోకి వెళితే... భర్తనుంచి విడిపోయిన తర్వాత మహిళకు అత్తారింట్లో ఉండే హక్కు ఉందని సుప్రీం కోర్టు పేర్కొంది. గృహ హింస చట్టం ప్రకారం.. ఆమెకు ఆ హక్కు ఉంటుందని జస్టిస్ అశోక్ భూషణ్, ఆర్ సుభాష్ రెడ్డి, ఎం ఆర్ షా ధర్మాసనం తెలిపింది.

దేశంలో గృహ హింస ప్రబలంగా ఉందని న్యాయస్థానం పేర్కొంది. ప్రతి రోజు కొంతమంది మహిళలు ఏదో ఒక రూపంలో హింసను ఎదుర్కొంటున్నారని కోర్టు తెలిపింది.  ఒక స్త్రీ తన జీవితకాలంలో కుమార్తె, సోదరి, భార్య, తల్లి, భాగస్వామి ఇలా పలు రకాల పాత్రలను పోషిస్తుందని చెప్పారు. అయినప్పటికీ.. దేశంలో మహిళలు వివక్ష ఎదుర్కొంటున్నారని కోర్టు భావించింది. 

2019 లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సతీష్ చందర్ అహుజా దాఖలు చేసిన అప్పీల్‌ను ఈ తీర్పు కొట్టివేసింది. ఇంతకీ మ్యాటరేంటంటే.. సతీష్ చందర్ అహుజా అనే వ్యక్తికి ఓ కుమారుడు రవీన్ అహుజా ఉన్నాడు. అతను అతని భార్య స్నేహ నుంచి విడాకులు తీసుకున్నాడు. అయినప్పటికీ.. స్నేహ అహుజా.. అత్తారింట్లోనే ఉంటోంది. 

ఈ నేపథ్యంలో. సతీష్ అహుజా కోర్టును ఆశ్రయించారు. విడాకుల తర్వాత   కూడా తమ కోడలు తమ ఇంట్లోనే ఉంటోందని ఆయన చెప్పారు. కాగా.. అప్పుడు ఢిల్లీ హైకోర్టు సదరు యువతికి అత్తారింట్లో ఉండేందుకు అనుమతి ఇస్తూ తీర్పు వెలువరించింది. అయితే.. దానిని సవాల్ చేస్తూ సతీష్ ఇటీవల సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. కాగా.. దానిని న్యాయస్థానం కొట్టివేసింది. సదరు యువతి భర్త నుంచి విడిపోయినప్పటికీ.. అత్తారింట్లో ఉండే హక్కు ఉందని కోర్టు తీర్పునిచ్చింది.

అయితే.. ఆ ఇళ్లు తన సొంత సంపాదనతో నిర్మించుకున్నది అని.. తమ కొడుకుకి కూడా వాటా లేదని.. అలాంటిది.. కోడలికి ఉండే హక్కు ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నించడం గమనార్హం. ఏది ఏమైనా భర్తతో విడిపోయిన తర్వాత ఒంటరి జీవితం గడుపుతూ ఎలాంటి ఆధారం లేకుండా పోతున్న చాలా మంది మహిళలకు ఈ తీర్పు కాస్త ఊరటనిస్తోంది. తమకంటూ ఓ ఇళ్లు ఉంటుందనే నమ్మకం కలుగుతుందని పలువురు భావిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios