ఆమె ఓ వ్యక్తిని ప్రేమించింది. నాలుగు సంవత్సరాలపాటు వారు ప్రేమించుకున్నారు. దీంతో వారి ప్రేమను పెద్దలు కూడా అంగీకరించారు. పెద్దల సమక్షంలో పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశారు. కొద్ది సేపట్లో పెళ్లి అనగా.. సదరు యువతి.. ఈ ప్రియుడిని కాదని.. మరో వ్యక్తితో లేచిపోయింది. ఏమంటే.. ఇతనితో కూడా ఆమె ప్రేమలో ఉందని తెలిసి అందరూ షాకయ్యారు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నుంగంబాక్కంకు చెందిన 23 ఏళ్ల యువతి ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తోంది. ఆమెకు అదే సంస్థలో పనిచేస్తున్న నెమిలిచేరికి చెందిన యువకుడితో నాలుగేళ్ల క్రితం ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. వీరి ప్రేమను అంగీకరించిన ఇరు కుటుంబాలు బుధవారం ఉదయం ఓ కల్యాణమండపంలో వివాహం చేసే ఏర్పాట్లు ముగించారు. వేడుకల్లో భాగంగా మంగళవారం రాత్రి వధూవరులు రిసెప్షన్‌ ఏర్పాటుచేసి బంధువులు, స్నేహితుల ఆశీర్వాదం తీసుకున్నారు.

వధూవరులు కల్యాణ మండపంలోని వేర్వేరు గదుల్లో బసచేశారు. అర్థరాత్రి 2 గంటల సమయంలో వధువు తల్లి గదిలోకి వెళ్లి చూడగా కుమార్తె గదిలో కనిపించలేదు. దీంతో దిగ్ర్భాంతి చెందిన ఆమె కల్యాణమండపం, పరిసర ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల విచారణలో, వధువు మరో యువకుడిని ప్రేమించిందని, అర్ధరాత్రి అతనితో వెళ్లిపోయిందని తెలిసింది. ఈ నేపథ్యంలో, సదరు వధువు, ఆమె మరో ప్రియుడు బుధవారం ఉదయం గిండీ పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు. సమాచారం అందుకున్న వధువు తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని, వారితో చర్చలు జరుపుతున్నారు.