ప్రేమను నిరాకరించిందనో.. పగతోనో అమ్మాయిలపై అబ్బాయిలు యాసిడ్ దాడి చేయడం లేదంటే, ప్రాణాలు తీయడమే లాంటి ఘటనలు మనం ఎన్నో చూశాం. అయితే తనను దూరం పెడుతున్నాడని అబ్బాయిపై ఓ అమ్మాయి యాసిడ్ దాడికి పాల్పడింది.

వివరాల్లోకి వెళితే.. త్రిపుర రాజధాని అగర్తలాకు 50 కిమీ దూరంలో ఉండే ప్రాంతానికి చెందిన బీనా (27), సోమన్(30) పక్క పక్కనే వుండేవారు. పదేళ్ల కిందట వీరిద్దరూ ప్రేమించుకొని వూరు విడిచి వెళ్లిపోయారు.

అలా 2010 నుంచి మహారాష్ర్టలోని పుణెలో నివాసం ఉన్నారు. ఆ సమయంలో సోమన్‌ చదువు కొనసాగించడానికి అవసరమైన డబ్బు కోసం బీనా చిన్న చిన్న పనులు చేసేది. అనంతరం సోమన్‌కు ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం వచ్చింది. తొమ్మిది సంవత్సరాల పాటు పుణెలో బీనాతో కలిసి ఉన్న సోమన్‌ 2019లో తన స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. 

అప్పటి నుంచి ఆ యువకుడు బీనాతో మాట్లాడటం మానేశాడు. సోమన్‌ కోసం ఆమె ఏడాది నుంచి ఎంతగానో గాలించింది. అయినా అతని ఆచూకీ లభించలేదు. ఎట్టకేలకు అక్టోబరు 19న త్రిపురలోని ఖోవై ప్రాంతంలో సోమన్‌ను బీనా గుర్తించింది.

అతనితో మాట్లాడటానికి ఎంతగా ప్రయత్నించినా సోమన్‌ నిరాకరించడంతో ఆమెకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వెంటనే అతనిపై యాసిడ్‌తో దాడి చేసింది. ఈ ఘటనలో సోమన్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

బాధితుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు బీనాను అరెస్టు చేశారు. యాసిడ్‌ దాడిలో శరీరం తీవ్రంగా కాలిపోవడంతో బాధితుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.