కారులో మంటలు చెలరేగి ముగ్గురు సజీవదహనమైన సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. తూర్పు ఢిల్లీలోని అక్షర్‌ధామ్‌ ఫ్లై ఓవర్‌పై ఆదివారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. 

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన ఉపేంద్ర మిశ్రా, రంజన మిశ్రాలు తన ముగ్గురు కుమార్తెలతో అక్షర్‌ధామ్‌ దేవాలయానికి కారులో వెళ్తున్నారు. అక్కడి ఫ్లైఓవర్‌ మీదకు రాగానే.. కారు వెనుక భాగంలో నుంచి మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు కారంతా వ్యాపించడంతో రంజన మిశ్రా, కుమార్తెలు రిధి, నిక్కి ప్రాణాలు కోల్పోయారు.

 సీఎన్జీ గ్యాస్‌ లీక్‌ కావడం వల్లే మంటలు చెలరేగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కారు డ్రైవ్‌ చేస్తున్న ఉపేంద్ర మిశ్రా.. ముందు సీట్లో కూర్చొన్న మరో కుమార్తెను తీసుకొని బయటకు వెళ్లిపోయాడు. దీంతో.. వీరు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. కాగా.. స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.