కరోనా టీకా వేసుకోకుంటే ఉచిత చికిత్స అందించబోమని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వార్నింగ్ ఇచ్చారు. అర్హులైన వారందరూ వెంటనే టీకా వేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు తప్పకుండా టీకా వేసుకోవాలని అన్నారు. లేదంటే ప్రతి వారం ఆర్టీపీసీఆర్ టెస్టు చేసుకోవాలని, ఆ టెస్టు ఖర్చులనూ సొంతంగా భరించుకోవాలని తెలిపారు. ఒమిక్రాన్ వేరియంట్ భయాందోళనలు పెరుగుతున్న తరుణంలో ఆయన ఉన్నత అధికారులతో సమీక్ష నిర్వహించారు. 

తిరువనంతపురం: దేశంలో తొలి కరోనా కేసు Keralaలోనే రిపోర్ట్ అయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఫస్ట్ వేవ్ అయినా సెకండ్ వేవ్ అయినా ఈ రాష్ట్రంలో కేసులు ఆందోళనకర స్థాయిలో నమోదయ్యాయి. ఇప్పటికీ దేశంలో అత్యధిక కేసులు ఈ రాష్ట్రం నుంచే రిపోర్ట్ అవుతున్నాయి. అయితే, కేసులు అధికంగా రిపోర్ట్ అవుతున్నా.. మరణాలు స్వల్పంగా ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు స్వల్పంగా వస్తున్నాయి. కరోనాను ఎదుర్కొనే ఏకైక ఆయుధం Vaccine అని తెలిసి కూడా చాలా మంది వెనుకడుగు వేస్తుండటం కేరళ ప్రభుత్వాన్ని అసంతృప్తికి గురి చేస్తున్నది. అందుకే కరోనా టీకా వేసుకోని వారికి రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా చికిత్స అందించబోదని సీఎం పినరయి విజయన్ (Pinarayi Vijayan) వార్నింగ్ ఇచ్చారు.

కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ (New Variant Omicron)తో ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు పెరిగిపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తంగా ఉండాలని, కేసులు, నిఘా పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే కేరళ సీఎం పినరయి విజయన్ ఈ రోజు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో టీకా పంపిణీ వేగాన్ని పెంచాలనే ఉద్దేశ్యంతో ఆయన కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే కరోనా కట్టడి చర్యలకు సహకరించని వారికి ఉచిత ట్రీట్‌మెంట్ అందించబోమని స్పష్టం చేశారు. కరోనా టీకాలు వేసుకోని వారికి చికిత్స ఖర్చులు భరించబోమని వివరించారు.

Also Read: Omicron: వేగంగా దేశాలు దాటుతున్న వేరియంట్.. ఆపడం సాధ్యమేనా? ఏయే దేశాలకు చేరిందంటే?

అంతేకాదు, కరోనా టీకా వేసుకోవడానికి భయపడుతున్న వారికీ సరికొత్త నిబంధనలు విధించారు. అలర్జీ లేదా ఇతర వ్యాధుల కారణంగా టీకా వేసుకోవడానికి భయపడుతున్న వారు ప్రభుత్వ వైద్యులతో వాటిని వెల్లడించే సర్టిఫికేట్‌లను తీసుకోవాలని అన్నారు. టీకాలు ఇంకా వేసుకోని ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు ఆ సర్టిఫికేట్లను సమర్పించాలని అన్నారు. ఒక వేళ వారు టీకా వేసుకోకుంటే ప్రతి వారం ఆర్టీపీసీఆర్ టెస్టు చేసుకోవాలని ఆదేశించారు. ఆ టెస్టు ఖర్చులనూ వారే సొంతంగా భరించుకోవాలని అన్నారు. ఆ టెస్టు రిపోర్టులను వెంటనే పై అధికారులకు సమర్పించాలని తెలిపారు. ఇది సదరు ఉద్యోగుల ఆరోగ్య పరిస్థితితోపాటు పాఠశాలలు, కళాశాలల్లో చదివే పిల్లల ఆరోగ్యానికి ఉపకరిస్తుందని వివరించారు.

Also Read: Omicron Symptoms: ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలు ఇవే.. ఆ ఏజ్ గ్రూప్‌ మీద ఎక్కువగా ప్రభావం..!

ఒమిక్రాన్ వేరియంట్ నుంచి పెరుగుతున్న ముప్పు నేపథ్యంలో ఆరోగ్య శాఖ వెంటనే అప్రమత్తం కావాలని, తగిన కట్టడి చర్యలు తీసుకోవాలని సీఎం పినరయి విజయన్ సూచనలు చేశారు. విదేశాల నుంచి కేరళ రాష్ట్రానికి వస్తున్న ప్రయాణికుల ట్రావెల్ హిస్టరీని ఎయిర్‌పోర్టులోనే క్షుణ్ణంగా పరిశీలించాలని వివరించారు. నిర్దేశిత నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతేకాదు, టీకా పంపిణీ పెరగడానికి స్థానిక సంస్థల ప్రతినిధులు నడుం బిగించాలని అన్నారు. వారి వారి సంస్థల పరిధిలో అర్హులైన ప్రజలు టీకా వేసుకునేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి 15 రోజుల పాటు ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టబోతున్నట్టు వివరించారు. ఆ డ్రైవ్‌లో అర్హులైన వారు తప్పకుండా టీకా వేసుకోవాలని సూచనలు చేశారు.