అనుమానం ఎంతటి దారుణానికైనా దారితీస్తుంది. తమిళనాడులోని కామక్కల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భర్త గొంతు కోసి హతమార్చిన భార్య ఏమి తెలియనట్లు నాటకాలు మొదలు పెట్టింది. చివరకు ఆమె బండారాన్ని పోలీసులు బయట పెట్టారు. మేడా మంగళం గ్రామానికి చెందిన కల్యాణ సుందరం(66) అనే వ్యక్తి చేనేత కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అతడితో పాటు పూంగొడి(46) అనే మహిళా కూడా పనిచేస్తోంది. వీరిద్దరికి ఏర్పడ్డ పరిచయంతో రెండో వివాహం చేసుకున్నారు. 

వీరిద్దరికి ఇప్పటికే 21, 19 ఏళ్ల వయసున్న కుమారులు ఉన్నారు. అయినా పెళ్లి చేసుకుని భార్య భర్తలుగా జీవిస్తూ వచ్చారు. కానీ కొన్ని రోజులకు భర్తపై పూంగొడికి అనుమానం పెరిగింది. అతడు ఇతర మహిళలతో సంబంధాలు కలిగిఉన్నాడని పూంగొడి భావించింది. అదే సమయంలో పూంగుడి కూడా మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటోందని కళ్యాణ సుందరంకు అనుమానం కలిగింది. ఈ విషయంలో భార్య భర్తల మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. 

శుక్రవారం తెల్లవారు జామున 4 గంటలకు పనికి అని చెప్పి కల్యాణ సుందరం ఇంట్లో నుంచి బయలుదేరాడు. నేను కూడా వస్తానంటూ పూంగొడి పట్టుబట్టింది. దీనికి కళ్యాణ సుందరం అంగీకరించకపోవడంతో ఇద్దరి మధ్య వాదన మొదలైంది. వస్తే కత్తితో చంపుతా అంటూ కల్యాణ సుందరం బెదిరించాడు. పూంగొడికి కూడా కోపం పెరిగి భర్తని వెనక్కు నెట్టింది. అతడి చేతిలో ఉన్న కత్తి లాక్కుని గొంతు కోసేసింది. 

వెంటనే ఇంటిబయటకు వచ్చి తలుపులకు తాళం వేసింది. తన భర్త చంపేందుకు వస్తున్నాడని అందుకే ఇంటికి తలుపులు వేశానని నమ్మించింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న కల్యాణ సుందరం తలుపులు తట్టాడు. కొంత సేపటికి ఇంట్లో నుంచి ఎలాంటి శబ్దం లేకపోవడంతో ఇరుగుపొరుగువారు వెళ్లి చూశారు. ఇంట్లో రక్తపు మడుగులో కళ్యాణసుందరం నిర్జీవంగా పడి ఉన్నాడు.  

తన భర్తే కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడంటూ ఏడవడం మొదలు పెట్టి ఆమె మరో నాటకానికి తెరతీసింది. పోలీసులు నెమ్మదిగా విచారణ ప్రారంభించారు. మొదట తన భర్తే ఆవేశంలో గొంతు కోసుకున్నాడని తెలిపింది. పోలీసులకు అనుమానం కలగడంతో వారి స్టైల్ లో ప్రశ్నించగా తానే హత్య చేసినట్లు అంగీకరించింది. దీనితో పూంగొడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.