కాంగ్రెస్ నేతలకు ఈడీ సమన్లు పంపడం, వాటిని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నిరసనలకు దిగడంపై తృణమూల్ కాంగ్రెస్ మండిపడింది. తమ నేతలకు సమన్లు పంపినట్టు మౌనం దాల్చిన కాంగ్రెస్ ఇప్పుడు ఎందుకు నిరసనలకు పిలుపు ఇస్తున్నదని ప్రశ్నించింది. ఇది కేవలం ఆ పార్టీ ద్వంద్వ వైఖరి మాత్రమేనని పేర్కొంది.
కోల్‌కతా: నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ విచారణకు రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఇదే రోజు మరో ప్రతిపక్ష పార్టీ తృణమూల్ కాంగ్రెస్ కీలక వ్యాఖ్యలు చేసింది. కాంగ్రెస్ పైనే మండిపడింది. తమ నేతలకు కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలు సమన్లు పంపినప్పుడు నోరుమూసుకుని ఉన్నదని ఆగ్రహించింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ధర్నాలు చేయడం ఎందుకు అని ప్రశ్నించింది. ఇది ఆ పార్టీ ద్వంద్వ నీతికి నిదర్శనం అని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మౌత్ పీస్ జాగో బంగ్లా పత్రిక పేర్కొంది.
జాగో బంగ్లా ఫ్రంట్ పేజీలో హెడ్ లైన్ ఇలా ఉంది. రాహుల్ గాంధీకి ఈడీ సమన్లు వచ్చాయి. కాంగ్రెస్ నిరసనలు.. సోనియా గాంధీ హాస్పిటల్‌లో ఉన్నారు అని అర్థం వచ్చే శీర్షికతో ప్రచురితమైంది.
కేంద్ర దర్యాప్తు ఏజెన్సీల నుంచి వారికి ఎప్పుడైతే సమన్లు వచ్చాయో అప్పటి నుంచి కాంగ్రెస్ అగ్ర నాయకత్వం భయంలో కూరుకుపోయిందని ఆ ఆర్టికల్ పేర్కొంది. ఈ విషయంలో తృణమూల్ కాంగ్రెస్‌కు స్పష్టమైన అభిప్రాయం ఉన్నదని వివరించింది. ఏజెన్సీల నుంచి సమన్లు రాగానే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పిలుపు ఇవ్వడం ఆ పార్టీ అవకాశవాదం, ద్వంద్వ వైఖరిని వెల్లడిస్తున్నదని తెలిపింది.
అంతేకాదు, బెంగాల్‌కు చెందిన కాంగ్రెస్ సీనియర్ లీడర్ అధిర్ రంజన్ చౌదరిపైనా ఆ ఆర్టికల్ విమర్శలు సంధించింది. తృణమూల్ కాంగ్రెస్‌పై కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలు దాడులు చేసినప్పుడు ఆ ఏజెన్సీలను అధిర్ రంజన్ చౌదరి ఆకాశానికి ఎత్తుకున్నారని, అలాగే, ఇప్పుడు కూడా రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు సమన్లు పంపిన ఈడీ నిర్ణయాన్ని గొప్పగా అభివర్ణించాలని వ్యంగ్యంగా పేర్కొంది.
బెంగాల్‌లో జీరోకు తెచ్చిన రాష్ట్ర కాంగ్రెస్ యూనిట్ ప్రెసిడెంట్ అధిర్ రంజన్ చౌదరి టీఎంసీపై రోజూ దాడి చేస్తుంటాడని వివరించింది. మరి ఇప్పుడు ఆయన అయినా, కాంగ్రెస్ నాయకత్వం అయినా.. ఇప్పుడు ఏం చెబుతుంది? అని ప్రశ్నించింది.
రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై 25 మంది విపక్ష నేతలతో సీఎం మమతా బెనర్జీ సమావేశం కావడానికి రెండు రోజుల ముందు ఈ ఆర్టికల్ రావడం గమనార్హం.
కాగా, తృణమూల్ లీడర్ మదన్ మిత్ర కూడా కాంగ్రెస్‌పై మండిపడ్డారు. ఇది వారి ద్వంద్వ వైఖరి అని కాంగ్రెస్‌ను విమర్శించారు. వారి పార్టీ నేతలకు సమన్లు జారీ అయినప్పుడు మమతా బెనర్జీ తన గళం ఎత్తిందని, కానీ, ఈడీ లేదా సీబీఐ అనుబ్రతా మండల్ లేదా ఇతరులకు సమన్లు పంపినప్పుడు ఆ పార్టీ నుంచి ఒక్కరూ మాట్లాడలేదని ఆరోపించారు. ఇది కేవలం వారి ద్వంద్వ నీతి మాత్రమేనని అన్నారు. అయినప్పటికీ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్న సోనియా గాంధీ త్వరగా కోలుకోవాలని కోరినట్టు వివరించారు.
ఇది జాతీయ పార్టీనా? ప్రాంతీయ పార్టీ సమస్యనా అనే ది విషయం కాదని ఆయన అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడటానికి 2019లో దీదీ విపక్షాలను ఏకం చేసి ఢీకొట్టడానికి తెచ్చిందని, ఇప్పుడు రాష్ట్రపతి అభ్యర్థిపైనా అందరినీ ఒక తాటి మీదకు తేవడం ఆమెకు సాధ్యమేనని చెప్పారు.
