Karnataka Hijab Row: కర్ణాటకలో హిజాబ్ వివాదం రోజురోజుకూ ముదురుతోంది. హిజాబ్ ధరించిన విద్యార్థినులకు విద్యా సంస్థలకు అనుమతి ఇవ్వాలని రాహుల్ గాంధీ మద్దతుగా మాట్లాడటంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. కర్ణాటకను తాలిబాన్ రాష్ట్రంగా మార్చడానికి అనుమతించామని కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Karnataka Hijab Row: కర్ణాటకలో హిజాబ్ వివాదం రోజురోజుకూ ముదురుతోంది. విద్యార్థులందరూ తప్పనిసరిగా యూనిఫాంనే ధరించాలని, అన్ని విద్యాసంస్థల్లో ఈ నియమం వర్తిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. హైకోర్టు తీర్పు వచ్చే వరకు ప్రభుత్వ ఆదేశాలను పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ క్రమంలో హిజాబ్ ధరించారనే కారణంలో ఉడుపి జిల్లాలోని పలు విద్యాసంస్థల్లో విద్యార్థినులను క్లాసులోకి అనుమతించలేదు.ముస్లిం విద్యార్థినులను విద్యాసంస్థల గేటు వద్దే అడ్డుకుంటున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి.
గత నెల రోజుల నుంచి ఇప్పటి వరకూ ఐదు కళాశాలల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఉడుపి జిల్లాల్లోని కుందాపూర్, ఉడుపి, బిందూర్‌లో హిజాబ్ ధరించిన విద్యార్థినులను తరగతులకు అనుమతించలేదు. ప్రభుత్వం జారీ చేసిన డ్రెస్ కోడ్ ప్రకారం తరగతి గదుల్లోకి హిజాబ్‌కు అనుమతి లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఈ వివాదంలో ముస్లీం విద్యార్థులకు కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ మద్దతుగా నిలిచారు. హిజాబ్ ధరించిన విద్యార్థినులకు విద్యా సంస్థలకు అనుమతి ఇవ్వాలని రాహుల్ గాంధీ సపోర్టుగా నిలిచారు. రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ‘‘విద్యార్థినుల హిజాబ్‌ను వారి విద్యా మార్గానికి అడ్డుగా రానివ్వడం ద్వారా భారత దేశ బాలికల భవిష్యత్తును దోచుకుంటున్నారు. సరస్వతీ మాత అందరికీ విజ్ఞానాన్ని ఇస్తుంది. ఆమె తేడాలు చూపదు’’ అని పేర్కొన్నారు.
దీనిపై కర్ణాటక బీజేపీ స్పందిస్తూ ఇచ్చిన ట్వీట్‌లో, విద్యకు మతం రంగు పులుముతున్నారని దుయ్యబట్టింది. భారత దేశ భవిష్యత్తుకు తాను ప్రమాదకరమని రాహుల్ గాంధీ మరోసారి రుజువు చేసుకున్నారని పేర్కొంది. విద్యావంతులవడానికి హిజాబ్ అంత ముఖ్యమైనదైతే, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో దీనిని ఎందుకు తప్పనిసరి చేయించలేదని ప్రశ్నించింది.
ఈ విషయంపై కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు నళిన్ కటీల్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని సూటిగా ప్రశ్నించింది. విద్యాభ్యాసం చేయడానికి హిజాబ్ చాలా అవసరం అయితే, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ దానిని ఎందుకు తప్పనిసరి చేయరు?" అని ప్రశ్నించారు. విద్యకు మతం రంగు పులుముతున్నారనీ, రాహుల్ గాంధీ భారతదేశ భవిష్యత్తుకు ప్రమాదకరమని మరోసారి నిరూపించుకున్నాడని విమర్శించారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఉందని, హిజాబ్ లేదా మరే ఇతర వివాదాలకు ఆస్కారం లేదని అన్నారు.
పాఠశాల సరస్వతీ ఆలయం లాంటిదని, పాఠశాల, కళాశాల నిబంధనలను పాటించాలని అన్నారు. మతపరమైన వివాదంలో విద్యాసంస్థల్లో సరికాదనీ, తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందనీ, విద్యార్థులు నిబంధనలను పాటించాలని సూచించారు. దీనిని మరో తాలిబాన్ రాష్ట్రంగా మార్చడాన్ని తాము అనుమతించామని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కర్ణాటక ప్రభుత్వం హిజాబ్‌ను అనుమతించదనీ, విషయం కోర్టులో ఉందనీ, కోర్టు తీర్పు కోసం వేచి ఉంటామనీ, పాఠశాల లేదా కళాశాల నిర్దేశించిన నిబంధనలను అందరూ పాటించాలని సూచించారు. ఈ అంశంపై కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య మాట్లాడుతూ.. ఇది ప్రాథమిక హక్కులకు విరుద్ధమని, ఆచరణలో లేని కాషాయ శాలువాను రద్దు చేసి.. బీజేపీ రాజకీయం చేయాలని చూస్తోందన్నారు. హిజాబ్ పేరుతో రాష్ట్రంలో మత సామరస్యాన్ని ఆటంకం కలిగించేలా బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ ప్రయత్నిస్తున్నాయని ఆయన ట్వీట్ చేశారు.
