Asianet News TeluguAsianet News Telugu

అసలు మీ ప్రాబ్లమేంటీ.. హిందీ ఎందుకు వద్దు: తమిళనాడు సర్కార్‌పై మద్రాస్ హైకోర్ట్ ఆగ్రహం

హిందీకి సంబంధించి మద్రాస్ హైకోర్టు (madras high court) .. తమిళనాడు ప్రభుత్వంపై (tamilnadu govt) ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘అసలు హిందీతో మీకు వచ్చే నష్టమేమిటి?’’ అంటూ ధర్మాసనం నిలదీసింది. రాష్ట్రంలోని చాలా మంది యువతకి హిందీ (hindi) రాక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను కోల్పోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది.

What harm will learning Hindi do Madras high court asks Tamil govt
Author
Chennai, First Published Jan 25, 2022, 2:51 PM IST

తమిళనాడు (tamilnadu) ప్రజలు మాతృభాషకు ఎంత విలువిస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకప్పుడు బలవంతంగా హిందీ రుద్దాలని చూసినప్పుడు ఏ స్థాయిలో ప్రతిఘటించారో అందరికీ తెలుసు. అంతేకాదు తమిళ భాషకు, సంస్కృతికి ఏమైనా అవమానం జరిగితే భగ్గున లేస్తారు. ఈ నేపథ్యంలో మరోసారి హిందీకి సంబంధించి మద్రాస్ హైకోర్టు (madras high court) .. తమిళనాడు ప్రభుత్వంపై (tamilnadu govt) ఆగ్రహం వ్యక్తం చేసింది. 

‘‘అసలు హిందీతో మీకు వచ్చే నష్టమేమిటి?’’ అంటూ ధర్మాసనం నిలదీసింది. రాష్ట్రంలోని చాలా మంది యువతకి హిందీ (hindi) రాక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను కోల్పోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. తమిళనాడులో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని అమలు చేయాల్సిందిగా దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై విచారణ సందర్భంగా మంగళవారం మద్రాస్ హైకోర్ట్ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.

విచారణ సందర్భంగా మూడు భాషల అమలు వల్ల విద్యార్థులపై అధిక భారం పడుతుందన్న ఉద్దేశంతో రెండు భాషలనే సర్కారు అమలు చేస్తోందని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఆర్.షణ్ముగ సుందరం కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయినప్పటికీ కూడా చాలా మంది హిందీ ప్రచార్ సభ వంటి ఇనిస్టిట్యూట్ల ద్వారా హిందీ నేర్చుకుంటున్నారని ఏజీ ధర్మాసనానికి వివరించారు.

దీనిపై స్పందించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మునీశ్వర్ నాథ్ భండారీ, జస్టిస్ పి.డి ఆదికేశవులతో కూడిన ధర్మాసనం.. నేర్చుకోవడానికి, బోధనకు చాలా వ్యత్యాసం వుందని వ్యాఖ్యానించింది. పిటిషన్ పై నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఒక్క మాతృభాషనే నేర్చుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని, ఇతర భారతీయ భాషలనూ నేర్చుకోవాలని కోర్ట్ సూచించింది. ప్రత్యేకించి హిందీ, సంస్కృత భాషలనూ నేర్చుకోవాల్సిన అవసరం ఉందని కడలూరుకు చెందిన అర్జునన్ ఇళయారాజా అనే వ్యక్తి ఈ పిల్ దాఖలు చేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios