కేరళ లో ఇటీవల ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. విమానం ల్యాండ్ అయిన తర్వాత..  రన్ వే పై దూసుకువెళ్తుండగా.. రెండు ముక్కలైంది. ఆ సమయంలో విమానంలో దాదాపు 190మంది ప్రయాణికులు ఉన్నారు. కాగా.. ఈ ఘటనలో 18మంది ప్రాణాలు కోల్పోగా... 150 మందికి పైగా గాయపడ్డారు.

కాగా.. ప్రమాదం జరిగిన వెంటనే తొలి ఐదు నిమిషాల్లో కేరళ విమానాశ్రయంలో ఏం జరిగిందనే విషయాన్ని అధికారులు తాజాగా వివరించారు. రాత్రి 7:40 గంటలకు దుబాయ్ నుండి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ బోయింగ్ 737 విమానం 190 మంది ప్రయాణికులతో  ల్యాండ్ అయ్యింది. అయితే..  భారీ వర్షం కారణంగా టేబుల్ టాప్ రన్‌వేపైకి  విమానం దూకి 35 మీటర్ల స్లోప్ మీద వెళ్లింది. దీంతో.. దీనికి సంబంధించిన  మొదటి కాల్ CISF అధికారి చేసినట్లు అధికారవర్గాలు తెలిపాయి.

క్రాష్ గేట్ నంబర్ 08 వద్ద ఉన్న అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ అజిత్ సింగ్ మొదటి వాకీ-టాకీ తో సమాచారాన్ని రాత్రి 7:40 గంటలకు సిఐఎస్ఎఫ్ కంట్రోల్ రూమ్కు పంపారు. 

రాత్రి 7:41 గంటలకు, సిఐఎస్ఎఫ్ కంట్రోల్ రూమ్.. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ మరియు సిఐఎస్ఎఫ్ క్విక్ రెస్పాన్స్ టీం ని పిలిచింది.

రాత్రి 7:42 గంటలకు విమానాశ్రయ అగ్నిమాపక కేంద్రం అప్రమత్తమైంది.

రాత్రి 7:43 గంటలకు, సిఐఎస్ఎఫ్ విమానాశ్రయ ఆరోగ్య విభాగానికి సమాచారం అందించారు.

రాత్రి 7:44 గంటలకు సిఐఎస్ఎఫ్ కంట్రోల్ రూమ్ విమానాశ్రయం టెర్మినల్ మేనేజర్.. విమానాశ్రయ డైరెక్టర్‌ను సంప్రదించి ఆరోగ్య సిబ్బందిని అప్రమత్తం చేశారు.

రాత్రి 7:45 గంటలకు CISF కంట్రోల్ రూమ్ స్థానిక పోలీసులకు మరియు ఏజెన్సీ యూనిట్ లైన్లకు సమాచారం అందించింది.

ప్రమాదం జరిగిన ఐదు నుండి ఏడు నిమిషాల్లో, ఆ ప్రాంతంలోని నివాసితులు కూడా విమానం కిందకు వెళ్లిన క్రాష్ గేట్ వద్దకు చేరుకున్నారు.

ప్రయాణికులను రక్షించేందుకు స్థానికులను కూడా వెంటనే అనుమతించడం గమనార్హం. సిఐఎస్ఎఫ్ వర్గాలు తీసుకున్న ఈ సత్వర నిర్ణయం కారణంగానే ఎక్కువ మంది ప్రయాణికులను రక్షించగలిగారు.