Asianet News TeluguAsianet News Telugu

ప్రశాంత్ కిశోర్ ప్రకారం బీజేపీ బలం ఇదే.. అందుకే విపక్షాలకు తన మద్దతు

ప్రశాంత్ కిశోర్ ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ బీజేపీ బలాల గురించి మాట్లాడారు. బీజేపీ ప్రస్తుతం ఎదురులేని శక్తిగా నిలబడటానికి దానికి మూడు అంశాలు కలిసి వస్తున్నాయని తెలిపారు. ఒకటి నేషనలిజం, మరొకటి హిందూత్వ, ఇంకొకటి వెల్ఫేరిజం అని వివరించారు. హిందూత్వ, జాతీయవాదం, సంక్షేమ విధానాలే ఆ పార్టీని బలమైన శక్తిగా కొనసాగిస్తున్నాయని వివరించారు. అదే సందర్భంలో బీజేపీని ఎదుర్కోవాలంటే ఏ పార్టీ అయినా చేయాల్సిన ఒక పనిని వెల్లడించారు. తాను ప్రతిపక్ష పార్టీలకే ఎందుకు మద్దతు ఇస్తున్నారో కూడా తెలిపారు.

what are driving bjp as powerful force explains prashant kishor
Author
New Delhi, First Published Jan 25, 2022, 2:10 PM IST

న్యూఢిల్లీ: ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్‌(Prashant Kishor)కు మంచి పేరు ఉన్నది. ఆయన ఒక పార్టీకి తన స్ట్రాటజీ(Strategy)ని అందిస్తున్నాడంటే.. ఆ పార్టీ గెలుపు దాదాపు ఖాయమైనట్టే అనే కొన్ని బలమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఆయన ఈ పార్టీకే సేవలు అందించాలనే ప్రత్యేక రూలేమీ పెట్టుకోలేదు. గతంలో బీజేపీ(BJP)కి కూడా సేవలు అందించారు. ఆ తర్వాత ఎక్కువగా ప్రతిపక్ష పార్టీలకే ఎక్కువగా తన మేధో శక్తిని అందిస్తున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు.. విశ్లేషణలూ అన్నీ పాపులర్ అవుతుంటాయి. ఈ నేపథ్యంలోనే ఆయన బీజేపీకి సంబంధించి ఓ తర్కాన్ని వదిలారు. బీజేపీకి బలం ఆ మూడేనని తెలిపారు. 

బీజేపీకి హిందూత్వ(Hindutva) అంశం ఎప్పుడూ చర్చలో ఉంచే విధానమే కాదు.. మరో రెండు అంశాలూ బలాన్ని చేకూరుస్తాయని ప్రశాంత్ కిశోర్ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘హిందూత్వ’ చాలా కీలకమైన అంశం అని, కానీ, అదొక్కటే బీజేపీని నిలిపి ఉంచడం లేదని వివరించారు. దానితోపాటు హైపర్ నేషనలిజం(Nationalism) కూడా ఒక కారణమని తెలిపారు. ఒకరకంగా చెప్పాలంటే.. హిందూత్వ కంటే కూడా ఒక్కోసారి జాతీయవాదమే ఆ పార్టీని కాపాడే పట్టుగొమ్మ అని చెప్పారు. దీనితోపాటు సంక్షేమ కార్యక్రమాలు మూడో అంశమని పేర్కొన్నారు. ఈ మూడు అంశాలే బీజేపీకి బలం అని వివరించారు. వ్యక్తగత, కుటుంబ స్థాయిల్లో సంక్షేమాలు, జాతీయవాదం, హిందూత్వ అంశాలు అన్నీ కలిసి బీజేపీని బలమైన శక్తిగా నిలబెడుతున్నాయని తెలిపారు.

అదే సందర్భంలో బీజేపీని ఎదుర్కోవడానికి కొన్ని కీలక అంశాలనూ వెల్లడించారు. ఈ మూడు అంశాల్లో కనీసం రెండింటిని తన సొంత విధానాలతో ఎదుర్కోకుంటే బీజేపీ ఎదుర్కొనే అవకాశాలు ఏ పార్టీకైనా చాలా తక్కువ అని వివరించారు. బీజేపీ సాధారణంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలను రాబట్టుకోలేదని తెలిపారు. ఎందుకంటే.. రాష్ట్రాల్లో జాతీయవాదం అనే విధానం బీజేపీకి కలిసి రాదని అన్నారు. ఎందుకంటే.. రాష్ట్రస్థాయిలో అక్కడి ప్రాంతీయ వైఖరులు జాతీయ వాదాన్ని కౌంటర్ చేస్తాయని పేర్కొన్నారు. అదే పార్లమెంటు లేదా జాతీయ ఎన్నికల విషయానికి వస్తే.. జాతీయవాదం ఇలాంటి అన్ని అవాంతరాలను అధిగమిస్తుందని వివరించారు. అంతేకాదు, 2024లో బీజేపీని ఓడించవచ్చునా? అనే ప్రశ్నకు తప్పకుండా ఓడించవచ్చు అని ప్రశాంత్ కిశోర్ తెలిపారు. అయితే, విపక్షాలు ఇప్పుడున్నట్టుగానే కొనసాగితే అది సాధ్యపడదని వివరించారు. కొంత సర్దుబాట్లు అవసరం అని తెలిపారు.

ప్రశాంత్ కిశోర్ గతంలో బీజేపీతో కూడా కలిసి పని చేశారు. ఇప్పుడు మాత్రం ఎక్కువగా విపక్షాల వైపు మొగ్గుచూపుతున్నారు. ఒకానొక దశలోనైతే.. ఆయన కాంగ్రెస్‌లో దాదాపు చేరిపోయాడనేంతగా వార్తలు వచ్చాయి. ఈ విషయంపై కాంగ్రెస్ కూడా స్పందించింది. ఎందుకు ఆయన బీజేపీకి వ్యతిరేకంగా లేదా బీజేపీ ఓడించాలనే పట్టుదలతో ప్రతిపక్షాలకు సేవలు అందిస్తున్నారని ప్రశ్నించగా.. సులువైన సమాధానం చెప్పారు. తాను ఏ పార్టీని, ఎవరినీ ఓడించాలనే లక్ష్యంతో పార్టీలకు సేవలు అందించడం లేదని వివరించారు. ఇది ప్రజాస్వామ్యం అని, ప్రజాస్వామ్యంలో అధికారపక్షానికి దీటుగా ప్రతిపక్షం కూడా ఉండాలని అన్నారు. ప్రతిపక్షం బలంగా ఉంటేనే ప్రజాస్వామ్యం పటిష్టంగా ఉంటుందని తెలిపారు. తాను ఈ సూత్రాన్ని నమ్ముతారని, అందుకే ప్రతిపక్షాలు బలంగా ఉండాలనే ఆలోచనలతోనే వాటికి సేవలు అందిస్తున్నట్టు చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios