Punjab Assembly Election 2022: త్వరలో జరగబోయే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమదే విజయమని ఆమ్ ఆద్మీ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. తమ పార్టీ అధికారంలోకి వస్తే..ఉద్యోగాలను సృష్టించడానికి, రాష్ట్ర క్రీడా పరిశ్రమను పునరుద్ధరించడానికి, రైతుల ఆదాయాన్ని పెంచడానికి కృషి చేస్తుందని ఆప్ నేత రాఘవ్ చద్దా అన్నారు.
Punjab Assembly Election 2022: ఈ నెలలో దేశంలోని పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్ లో గురువారం తొలి దశ పోలింగ్ ప్రారంభం కాగా, మణిపూర్, గోవా, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ ఎన్నికలు మినీ సంగ్రామాన్ని తలపిస్తున్నాయి. ఇక పంజాబ్ లో ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. విమర్శలు, ఆరోపణలతో విరుచుకుపడుతుండటంతో రాజకీయాలు కాక రేపుతున్నాయి. రాష్ట్రంలో మళ్లీ అధికారం దక్కించుకోవాలని కాంగ్రెస్ గట్టిగా ప్రయత్నాలు చేస్తుండగా, కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ (ఆప్) సైతం తనదైన స్టైల్ లో ప్రచారం కొనసాగిస్తూ.. అధికార పీఠం దక్కించుకోవాలని చూస్తుంది.
ఈ నేపథ్యంలోనే ఆమ్ ఆద్మీ నేత రాఘవ్ చద్దా మీడియాతో మాట్లాడుతూ.. పంజాబ్‌లో జరగబోయే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ జయకేతనం ఎగురవేసి.. అధికారం దక్కించుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర వాస్తవ సమస్యల ఆధారంగా ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నిస్తున్న ఏకైక పార్టీ ఆప్ మాత్రమేనని, గెలిస్తే అమలు చేసేందుకు రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేసిందని తెలిపారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే..ఉద్యోగాలను సృష్టించడానికి, రాష్ట్ర క్రీడా పరిశ్రమను పునరుద్ధరించడానికి, రైతుల ఆదాయాన్ని పెంచడానికి కృషి చేస్తుందని ఆప్ నేత రాఘవ్ చద్దా అన్నారు. పంజాబ్‌ను అప్పులు లేని రాష్ట్రంలో చేస్తామని అన్నారు. పంజాబ్‌లోని వివిధ పరిశ్రమలు, పలు రంగాలు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడం, సులభతరం చేయడంపై AAP దృష్టి ఉంటుందని పేర్కొన్నారు.
అలాగే, "మా కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సంబంధిత పరిశ్రమలతో సంభాషిస్తున్నారు. మేము పంజాబ్ క్రీడా పరిశ్రమతో చాలా సన్నిహితంగా పని చేస్తున్నాము" అని చద్దా అన్నారు. “భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ ఉపయోగించే బ్యాట్ పంజాబ్‌లోని జలంధర్‌లో తయారు చేయబడిందనీ, చాలా మంది అంతర్జాతీయ ఆటగాళ్ళు ఉపయోగించే హాకీ స్టిక్‌లను ఇక్కడ తయారు చేశారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు, అయినప్పటికీ, పంజాబ్ క్రీడా పరిశ్రమకు దాని బకాయిలు అందడం లేదు... దీనికి సరైన సహకారం అభించడం లేదు. అయితే, మేము దాని కీర్తిని తిరిగి తీసుకురావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని" తెలిపారు.
పంజాబ్ ప్రజలు గతంలో విఫలమైన ప్రభుత్వాల పట్ల విసిగిపోయారని ఈ సారి ఆప్ కు అవకాశం ఇవ్వడానికి సిద్ధమయ్యారని రాఘవ్ చద్దా తెలిపారు. ప్రస్తుతం జరగనున్న పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఆప్ బలమైన పోటీ దారుగా ఉంది. తొలిసారి ఎన్నికల బరిలో నిలిచినప్పుడే మెరుగైన ఫలితాలు రాబట్టింది ఆప్. ఏకంగా 20 స్థానాల్లో విజయం సాధించి రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఆప్ కొనసాగుతోంది. శుక్రవారం జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆప్ నేత భగవంత్ మాన్ మీడియాతో మాట్లాడుతూ.. ఆప్ కు ప్రజల నుంచి అద్బుతమైన స్పందన వస్తున్నదని తెలిపారు. పంజాబ్‌లో ఆప్‌ని గెలవనీయకుండా ఆపేందుకు బీజేపీ, అకాలీ, కాంగ్రెస్‌లు కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. కాగా, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరీ 14 జరగాల్సి ఉన్నాయి. అయితే, ఆ రోజు గురు రవిదాస్ జయంతి కావడంతో.. ఈ విషయాన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లడంతో ఫిబ్రవరీ 20 కి మార్చింది. పంజాబ్‌లోని 117 నియోజకవర్గాల్లో ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఫలితాలు వెల్లడికానున్నాయి.
