:కొత్త వ్యవసాయ చట్టాలతో ఏ ఒక్క రైతుకు నష్టం జరగదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు.
న్యూఢిల్లీ:కొత్త వ్యవసాయ చట్టాలతో ఏ ఒక్క రైతుకు నష్టం జరగదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోడీ బుధవారం నాడు సాయంత్రం పార్లమెంట్ లో ప్రసంగించారు.
కొత్త చట్టాల ద్వారా దేశంలో ఎక్కడైనా వ్యవసాయ మార్కెట్లు మూతపడ్డాయా అని ఆయన ప్రశ్నించారు. ఈ చట్టాలతో రైతులకు మద్దతు ధర ఎక్కడైనా లభించలేదా అని ఆయన అడిగారు. సభలో కావాలనే తన ప్రసంగాన్ని అడ్డుకొంటున్నారని ఆయన విపక్షాల తీరుపై విమర్శలు గుప్పించారు.
సాగు చట్టాలపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మోడీ మండిపడ్డారు. ఈ చట్టాలతో రైతులకు నష్టం కలగదని ఆయన తేల్చి చెప్పారు. రైతులకు నష్టం కల్గించే చట్టాలను ఎందుకు తీసుకొస్తామని ఆయన ప్రశ్నించారు.
also read:కరోనా కాలంలో భారత్ ఎదురొడ్డి నిలిచింది: మోడీ
ఇప్పటికే ఉన్న మార్కెట్లపై ఎలాంటి ఆంక్షలు లేవన్నారు. దేశ ప్రగతికి కొత్త సాగు చట్టాలు అవసరమన్నారు. రాజ్యసభలో ఓ రకంగా, లోక్‌సభలో ఓ రకంగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. సాగు చట్టాలపై కాంగ్రెస్ నేతలు గందరగోళంలో ఉన్నారన్నారు.
ప్రపంచంలో గొప్ప శక్తిగా ఎదిగేందుకు భారత్ కృషి చేస్తోందన్నారు. ఈ దిశగా వెళ్లేందుకు ఆత్మ నిర్భర్ భారత్ నినాదం తీసుకొచ్చినట్టుగా ఆయన గుర్తు చేశారు. ఫార్మా రంగంలో మనం ఇప్పటికే ఆత్మనిర్భర్ సాధించినట్టుగా చెప్పారు.
