కాంగ్రెస్ పార్టీ ముందు మరింత కఠినమైన సవాళ్లు ఉన్నాయని ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. తమ పార్టీ ఐక్యంగా ఉంచేందుకు, మరింత బలంగా తయారు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ఆమె మంగళవారం పార్లమెంటరీ పార్టీ జనరల్ బాడీ సమావేశంలో పాల్గొని మాట్లాడారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దిగ్భ్రాంతికరమైనవని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. ఈ ఫలితాలు చాలా బాధకరమైనవని అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీ ముందు మునుపెన్నడూ లేని సవాళ్లు ఉన్నాయని తెలిపింది. ఇది పార్టీ అంకితభావం, దృఢ సంకల్పం, స్ఫూర్తిని పరీక్షించగలదని చెప్పారు.
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పార్టీ పార్లమెంటరీ పార్టీ జనరల్ బాడీ సమావేశంలో నాయకులను, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె G 23 నాయకుల అసంతృప్తిని లేదా అనేక రాష్ట్ర విభాగాలలో వినిపిస్తున్న వ్యాఖ్యలను ప్రస్తావించకుండా పార్టీలో ఐక్యతను నిర్ధారించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. “ ఇటీవలి ఎన్నికల ఫలితాలతో మీరు ఎంత నిరాశకు లోనయ్యారో నాకు బాగా తెలుసు. అవి షాకింగ్ కు గురి చేసేలా ఉన్నాయి. చాలా బాధకరమైనవి కూడా. మన పనితీరును సమీక్షించేందుకు CWC ఒకసారి సమావేశమైంది. నేను ఇతర మన సహోద్యోగులను కూడా కలిశాను. మన సంస్థను ఎలా బలోపేతం చేయాలనే దానిపై నాకు చాలా సూచనలు వచ్చాయి. నేను వాటిపై పని చేస్తున్నాను ” అని అమె తెలిపారు.
“ ముందున్న రహదారి గతంలో కంటే చాలా సవాలుగా ఉంది. మా అంకితభావం, సంకల్పం, మన దృఢత్వ స్ఫూర్తి తీవ్ర పరీక్షలో ఉన్నాయి. మన విస్తారమైన సంస్థకు అన్ని స్థాయిలలో ఐక్యత చాలా ముఖ్యమైనది. దాని కోసం నేనే అవసరమైందంతా చేయాలని నిశ్చయించుకున్నాను, ” అని సోనియా గాంధీ అన్నారు. కాంగ్రెస్ పునరుజ్జీవనం కేవలం మనకు మాత్రమే ముఖ్యమైన విషయం కాదని ఆమె తెలిపారు. నిజానికి మన ప్రజాస్వామ్యానికి, మన సమాజానికి కూడా ఇది చాలా అవసరం అని ఆమె చెప్పారు.
ఈ సమావేశం సందర్భంగా సోనియా గాంధీ బీజేపీ ప్రభుత్వ విధానాలు, అధికార పార్టీ విభజన ఎజెండాపై దాడి చేశారు. ప్రతిపక్షాలు, నాయకులు, కార్మికులపై ప్రభుత్వం దాడులు కొనసాగిస్తోందని ఆమె అన్నారు. MSMEలు ఇప్పటికీ దేశంలో అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్నాయని చెప్పారు. రైతులకు ఇచ్చిన హామీలు ఏ మాత్రం చెప్పుకోదగ్గ రీతిలో నెరవేరే సూచనలు కనిపించడం లేదని అన్నారు. వంటగ్యాస్, నూనె, పెట్రోల్, డీజిల్, ఎరువులు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు భరించలేని పరిమితికి పెరిగాయని, ఇంకా పెరుగుతున్నాయని సోనియా గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో అమల్లోకి వచ్చిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA), జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని సోనియా గాంధీ అన్నారు. ఈ సందర్భంగా ఆమె చైనా దూకుడుపై కూడా వ్యాఖ్యలు చేశారు. పదే పదే ప్రయత్నించినప్పటికీ, మన సరిహద్దుల్లోని పరిస్థితులపై చర్చకు ప్రభుత్వం అంగీకరించేలా చేయలేకపోయామని అన్నారు. ఉక్రెయిన్ నుంచి తీసుకొచ్చిన వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు ప్రభుత్వం వీలైనంత త్వరగా భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. దేశంలో వైద్య విద్యపై పెరుగుతున్న వ్యయాన్ని పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సోనియా గాంధీ అన్నారు.
ఇటీవల కేంద్ర కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మె, వారు లేవనెత్తిన సమస్యలను సోనియా గాంధీ ప్రస్తావిస్తూ... “ పెరుగుతున్న నిరుద్యోగం, జీవనోపాధి అభద్రత సమయంలో కార్మిక చట్టాలు పలుచన చేయబడ్డాయి. ఉద్యోగుల భవిష్య నిధి నిల్వలపై వడ్డీ రేట్లు గణనీయంగా తగ్గాయి. ప్రభుత్వ రంగ సంస్థలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల ఉపాధికి ఒక ముఖ్యమైన మార్గం అసెట్ మానిటైజేషన్ అనే ఫ్యాన్సీ పేరుతో విక్రయించబడుతున్నాయి. డీమోనిటైజేషన్‌గా మారిన తర్వాత ఇది మరో విపత్తు అవుతుంది.’’ అని ఆమె అన్నారు.
