కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలను  కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించింది. అయితే వయనాడ్‌ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికను ప్రకటించలేదు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలను కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించింది. అలాగే జలంధర్ లోక్‌సభ స్థానంతో పాటు వివిధ రాష్ట్రాల్లోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నిక షెడ్యూల్‌ను కూడా ప్రకటించింది. అయితే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను ఈసీ ఈరోజు ప్రకటిస్తుందనే వార్తలు రాగానే.. వయనాడ్‌కు ఉప ఎన్నికను ప్రకటిస్తుందా? లేదా? చర్చ మొదలైంది. గత వారం పరువు నష్టం కేసులో దోషిగా తేలిన తర్వాత వయనాడ్‌ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వయనాడ్ ఉప ఎన్నిక నిర్వహణపై ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననే ఉత్కంఠ నెలకొంది. 

అయితే ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో వయనాడ్ లోక్‌సభ స్థానానికి ఉపఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించలేదు. వయనాడ్‌ ఉప ఎన్నికపై సీఈసీ రాజీవ్ కుమార్ స్పందిస్తూ.. సెషన్ కోర్టు రాహుల్ గాంధీకి నెల రోజు సమయం ఇచ్చిందని, తొందరేమి లేదని అన్నారు. ‘‘రాహుల్ గాంధీ దోషిగా తేలడంతో న్యాయపరమైన పరిష్కారానికి ట్రయల్ కోర్టు 30 రోజుల సమయం ఇచ్చింది. తొందరపాటు లేదు. వేచిచూస్తాం’’ అని తెలిపారు. 

ఒక్క స్థానం ఖాళీ అయితే ఉప ఎన్నిక నిర్వహించడానికి ఆరు నెలల సమయం ఉంటుందని చెప్పారు. ‘‘ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 151 ప్రకారం.. ఖాళీలు ఉన్నప్పుడల్లా.. ఖాళీ నోటిఫికేషన్ తేదీ నుంచి 6 నెలల్లో ఉప ఎన్నికలను ప్రకటించాలి. ఈ సందర్భంలో ఇది మార్చి 23.. మాకు ఆరు నెలల సమయం ఉంది’’ అని రాజీవ్ కుమార్ చెప్పారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ప్రకటించిన జాబితాలో వయనాడు ఉప ఎన్నికపై ఎటువంటి ప్రకటన చేయలేదని తెలుస్తోంది.