Asianet News TeluguAsianet News Telugu

అసలు ఏమిటీ కచ్చతీవు వివాదం..? ఇందులో కాంగ్రెస్ చేసిన తప్పేంటి?

కచ్చతీవు వివాదంపై విశ్వహిందూ పరిషత్  జాతీయ జనరల్ సెక్రటరీ డా. సురేంద్ర జైన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈ ద్వీపాన్ని శ్రీలంకకు అప్పగించడంద్వారా దేశానికి జరిగిన ప్రయోజనం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఇలా కాంగ్రెస్ పార్టీకి పలు ప్రశ్నలు సంధించింది విహెచ్పి. 

Vishva Hindu Parishad reacts on  Katchatheevu Island issue AKP
Author
First Published Apr 4, 2024, 3:13 PM IST

న్యూడిల్లీ : కచ్చతీవు వివాదం ఇప్పుడు భారత రాజకీయాలను కుదిపేస్తోంది. భారత్-శ్రీలంక మధ్యలోని పాక్ జలసంధిలోని ఈ ద్వీపం వ్యూహాత్మక ప్రాంతం... ఇలాంటి ద్వీపం ప్రస్తుతం శ్రీలంక ఆధీనంలో వుంది.  అగ్ని పర్వత విస్పోటనం కారణంగా ఏర్పడిన ఈ 285 ఎకరాలు నిర్మానుష్య ద్వీపాన్ని ఆనాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం శ్రీలంకకు అప్పగించింది. భారత్ కు అతి సమీపంలోని ఈ కచ్చతీవు శ్రీలంక ఆధీనంలో వుండటంపై తీవ్ర వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో విశ్వహిందూ పరిషత్ కూడా ఈ కచ్చతీవు వివాదంపై స్పందించింది. 

భారతదేశానికి వ్యూహాత్మకంగానే కాదు ఆర్థికంగానూ కచ్చతీవు చాలా కీలకమైనది... అలాంటి ద్వీపాన్ని భారత భూభాగం నుండి తొలగించడం కాంగ్రెస్ చేసిన అతిపెద్ద తప్పు. ఇలా ఒక్కసారి కాదు అనేకమార్లు భారత సమగ్రతను కాంగ్రెస్ దెబ్బతీసిందని విశ్వహిందు పరిషత్ జాతీయ జనరల్ సెక్రటరీ డా. సురేంద్ర జైన్ ఆందోళన వ్యక్తం చేసారు. కాబట్టి రాబోయే లోక్ సభ ఎన్నికల్లో దేశభక్తి, జాతీయవాదం కలిగిన భారతీయులు కచ్చతీవులనే కాదు దురాక్రమణలకు గురయిన భారత భూభాగాన్ని తిరిగి సాధించే దమ్మున్న పార్టీనే గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేసారు. దేశానికి చెందిన భూ వాయు జల ప్రాంతాలను కాపాడే ప్రభుత్వం ఏర్పడుతుందని.... మా భారతిని దోపిడీదారుల నుండి కాపాడి ప్రజలు కోరుకున్న అఖండ భారతాన్ని ఏర్పాటుచేస్తుందని విహెచ్పి నేత పేర్కొన్నారు. 

కచ్చతీవు ద్వీపం చారిత్రాత్మకంగా చూసుకున్నా భారత్ లో అంతర్భాగమేనని అన్నారు.  అయితే మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఈ ద్వీపాన్ని రాజ్యాంగానికి విరుద్దంగా శ్రీలంకకు అప్పగించారు... ఈ నిర్ణయం దేశ సార్వభౌమాధికారానికి, సమగ్రతకు విరుద్దమని విహెచ్పి నేత ఆందోళన వ్యక్తం చేసారు. పార్లమెంట్, తమిళనాడు అసెంబ్లీ అనుమతి లేకుండానే కచ్చతీవును అప్పగించి లక్షలాదిమంది మత్స్యకారుల ద్రోహం చేసారన్నారు. దేశ సార్వభౌమత్వం, సమగ్రత విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని విహెచ్పి తీవ్రంగా ఖండిస్తోందని సురేంద్ర జైన్ అన్నారు.    

1974 జూన్ 26 న కచ్చతీవు ద్వీపాన్ని తన సొంత జాగీర్ అన్నట్లుగా ఇందిరా గాంధీ శ్రీలంకకు అప్పగించింది.  వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన ఈ ద్వీపం విషయంలో 1956 నుండి 1974 వరకు భారత్ శ్రీలంక మధ్య వివాదం సాగింది... శ్రీలంక చొరబాట్లు, భారత మత్స్యకారులతో వ్యవహరిస్తున్న తీరుపై పార్లమెంట్ లో అనేకమార్లు చర్చలు జరిగాయి.  కానీ ఇవేమీ తనకు పట్టవన్నట్లుగా ఇందిరా గాంధీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని... కచ్చతీవులను శ్రీలంకకు పళ్లెంలో పెట్టిమరీ అప్పగించిందన్నారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీలో అనేక తీర్మానాలు చేసి ఆమోదించిందని... అయినా ఇందిరాగాంధీ వీటిని పట్టించుకోలేదని సురేంద్ర జైన్ తెలిపారు. 

ఈ లింక్ పై క్లిక్ చేసి ఏషియా నెట్ సర్వేలో పాల్గొనండి  https://telugu.asianetnews.com/mood-of-andhra-survey

కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంకకు అప్పగించడం రాజ్యాంగ విరుద్దం... ఈ విషయాన్ని సుప్రీంకోర్టు తీర్పులు కూడా స్పష్టంగా వున్నాయన్నారు. దేశ భూభాగాన్ని లేదా ప్రాంతాన్ని ఏదైనా ఒప్పందం ప్రకారం ఇతర దేశాలకు ఇవ్వాల్సి వచ్చినపుడు పార్లమెంట్ అనుమతి తప్పనిసరి... నిర్ణయం తీసుకునే అధికారం కూడా పార్లమెంట్ కే వుంటుందని విహెచ్పి నేత తెలిపారు. అంతేకాదు ఆ ప్రాంత ప్రజల హక్కులను కాపాడుతూ నిర్ణయం వుండాలని సుప్రీం కోర్టు పేర్కొంది. హక్కులకు భంగం కలిగించేలా నిర్ణయాలు తీసుకోవద్దని న్యాయస్థానం సూచించిందన్నారు. కానీ కచ్చతీవు ద్వీపం విషయంలో తమిళ సమాజం మనోభావాలను, హక్కులను పట్టించుకోలేదని అన్నారు. 

 భారత సార్వభౌమత్వం, సమగ్రతను కాంగ్రెస్ ఏనాడూ పట్టించుకోలేదు... అందువల్లే స్వాతంత్య్రం వచ్చిన కొద్ది రోజులకే కాశ్మీర్‌లోని 42,735 చదరపు కిలోమీటర్ల భూభాగం చైనా, 34,639 చదరపు కిలోమీటర్ భూభాగం పాకిస్థాన్ స్వాధీనం చేసుకుందన్నారు. ఈ భూభాగాలను తిరిగి పొందేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడూ ప్రయత్నించలేవన్నారు. చైనా ఆక్రమించిన ప్రాంతం ఎందుకూ పనికిరానిదని... అక్కడ గడ్డికూడా పెరగదు మనకెందుకని ఆనాటి ప్రధాని నెహ్రూ చాలా నిర్లక్ష్యంగా మాట్లాడారని గుర్తుచేసారు. నెహ్రూ వ్యాఖ్యలకు ఆనాటి ఎంపీ భాయ్  మహవీర్ త్యాగి రాజ్యసభలో మాట్లాడుతూ'నాకు బట్టతల వుంది. అలాగని నేను నా తలను వదులుకుంటానా?' అని చమత్కించారని గుర్తుచేసారు. టిబెట్‌ను చైనా అక్రమంగా ఆక్రమించినప్పుడు కూడా నెహ్రూ జాతీయ ప్రయోజనాల గురించి ఆలోచించలేదని  విహెచ్పి నేత పేర్కొన్నారు. 

ఈ సందర్భంగా విహెచ్పి కాంగ్రెస్ నేతలకు కొన్ని ప్రశ్నలను సంధించింది. 

 1. భారతీయ సార్వభౌమాధికారం పట్ల కాంగ్రెస్ ఎందుకు అంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది?

2. కచ్చతీవును శ్రీలంకకు అప్పగించడం ద్వారా భారతదేశం యొక్క ఏ జాతీయ ప్రయోజనాలు నెరవేరుతున్నాయి?

3. పార్లమెంటును ఎందుకు మోసం చేశారు? పార్లమెంటు చట్టపరమైన ఆమోదం తప్పనిసరి అయినప్పటికీ కచ్చతీవు ద్వీపం అప్పగింత ఒప్పందానికి ముందుగానీ, తర్వాత గానీ  ఎందుకు చర్చించలేదు?

4. తమిళనాడులోని లక్షలాది మత్స్యకారుల ప్రయోజనాలను పరిరక్షిస్తామని పదే పదే హామీలు ఇచ్చినా ఆ ప్రభుత్వాలు ఏం చేశాయి?
 
 తమ వ్యక్తిగత ప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎల్లప్పుడూ జాతీయ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాయని విశ్వహిందూ పరిషత్ గుర్తించిందన్నారు.  కచ్చతీవులనే కాదు మన భూభాగాలన్నింటినీ తిరిగి స్వాధీనం చేసుకోవాలన్న ప్రజా సంకల్పాన్ని నెరవేర్చగల  ప్రభుత్వం ఏర్పడుతుందని విహెచ్పి విశ్వసిస్తోందని సురేంద్ర జైన్ తెలిపారు.


  
 

Follow Us:
Download App:
  • android
  • ios