Viral News : ఓ యువకుడి సమయస్పూర్తి రెండు నిండు ప్రాణాలను కాపాడింది. వైద్యులకోసం ఎదురుచూడకుండా యువకుడే గర్బిణికి డెలివరీ చేయడంతో తల్లీబిడ్డ ఇద్దరి ప్రాణాలు దక్కాయి.
Viral News : త్రీ ఇడియట్స్ (తెలుగులో స్నేహితుడు) మూవీలో హీరో ఎలాంటి మెడికల్ బ్యాగ్రౌండ్ లేకుండానే ఓ గర్బిణి మహిళకు డెలివరీ చేసే సీన్ గుర్తుండే ఉంటుంది. సేమ్ అలాంటి సీన్ నిజజీవితంలో చోటుచేసుకుంటే... అవును, మీరు వింటున్నది నిజమే. ఓ యువకుడు ప్రసవ వేధనతో బాధపడుతున్న మహిళకు డెలివరీ చేసిన ఘటన ముంబై రైల్వే స్టేషన్ లో చోటుచేసుకుంది. అతడు సకాలంలో స్పందించి సమయస్పూర్తితో వ్యవహరించడంతో తల్లి, బిడ్డా క్షేమంగా ఉన్నారు.
రైల్లోనే గర్బిణి ప్రసవ వేధన
వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన ఓ నిండు గర్భిణిని కుటుంబసభ్యులు వైద్య పరీక్షల కోసం హాస్పిటల్ కు తీసుకెళ్ళారు. అయితే ప్రసవానికి ఇంకా సమయం ఉందని వైద్యులు చెప్పడంతో ట్రైన్ లో ఇంటికి తిరుగుపయనం అయ్యారు. కానీ మార్గమధ్యలోనే గర్భిణికి ఒక్కసారిగా పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి... దీంతో ఏం చేయాలో కుటుంబసభ్యులకు తోచలేదు. ఆమె ప్రసవవేధన అదే రైల్లో ఉన్న ఓ యువకుడిని కదిలించింది. వెంటనే ఆమెకు సాయం చేయడానికి ముందుకువచ్చాడు.
యువకుడే డాక్టర్ గా మారి డెలివరీ..
వెంటనే రైలు ఎమర్జెన్సీ చైన్ లాగి రైలును ఆపాడు... ఇలా ముంబైలోని రామ్ మందిర్ రైల్వే స్టేషన్ లో ఆగింది. అయితే అప్పుడు సమయం రాత్రి 1 అవుతోంది... ఆ సమయంలో అంబులెన్స్ లు అందుబాటులో లేవు. దీంతో సదరు యువకుడు వెంటనే ఓ మహిళా డాక్టర్ సహకారంతో తానే డెలివరీ చేసేందుకు సిద్దమయ్యాడు. కాల్ లోనే డాక్టర్ సూచనలు పాటిస్తూ విజయవంతంగా డెలివరీ చేశాడు. ఇలా తల్లిబిడ్డ ప్రాణాలను కాపాడిన యువకుడిని అందరూ ప్రశంసిస్తున్నారు. అతడి సమయస్పూర్తితో రెండు ప్రాణాలను కాపాడిన తీరు నెటిజన్లను కూడా ఆకట్టుకుంటోంది. అందుకే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
