మహారాష్ట్ర, థానేలో వృద్ధుడైన ఓ పూజారి తన భార్యను కొడుతున్న వీడియో వైరల్ అయ్యింది. దీంతో 85 ఏళ్ల ఆ పూజారిని భార్యపై దాడి చేసినందుకు గానూ  పోలీసులు అరెస్ట్ చేశారు.

అంతేకాదు ఈ వీడియోలో నిందితుడి మనవరాళ్లు, ఆమెను కొట్టొద్దని విజ్ఞప్తి చేయడం కనిపించింది. బాధితురాలు దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు సోమవారం నిందితుడిని అరెస్టు చేసి భారతీయ శిక్షాస్మృతి సెక్షన్లు 323, 324 (స్వయంగా బాధకలిగించడం), 504 (శాంతికి భంగం కలిగించే విధంగా ఉద్దేశపూర్వకంగా అవమానించడం), 506 (క్రిమినల్ బెదిరింపు) )కింద కేసులు నమోదు చేశారు. 

నిందితుడు గజానన్ చికంకర్‌ గా పోలీసులు గుర్తించారు. అతను హిల్ లైన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబర్‌నాథ్ తాలూకాలోని ద్వారాలి గ్రామానికి చెందినవాడని తెలిపారు. 85యేళ్ల గజానన్ చికంకర్‌ సమీపంలోని ఆలయంలో పూజారిగా పనిచేస్తున్నాడు. 80 యేళ్ల వయసున్న తన భార్య మీద దాడిచేశాడు. ఈ మేరకు ఉల్హాస్నగర్ లోని హిల్ లైన్ పోలీస్ స్టేషన్ పోలీసులు వివరాలు తెలిపారు. 

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఈ వీడియో  శివసేన మహిళా విభాగం దృష్టిలో పడింది. దీని మీద వీరు ఆరా తీయగా.. ఈ వీడియోను మే 31 న నిందితుడి 13 ఏళ్ల మనవడు రికార్డ్ చేశాడని తెలిసింది. దీని మీద వారు విచారణ జరపగా..  తాత ఎంత వద్దని చెబుతున్నా.. అమ్మమ్మను చెంపదెబ్బలు కొట్టి... బకెట్‌తో బాదాడని తెలిపాడు. దీంతో తాను వీడియో తీశానని.. దాన్ని మెసెంజర్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేశానని చెప్పుకొచ్చాడు.

ఈ కేసులో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడానికి సుముఖంగా లేకపోవడంతో పోలీసు అధికారులు దీన్ని సుమోటోగా తీసుకుని చికాంకర్‌పై దాడి కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ తరువాత, చికంకర్ను అరెస్టు చేశారు.