ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కర్ రాజీనామాతో ఎన్నిక అనివార్యం అయ్యింది. కొత్త ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్, జస్టిస్ సుదర్శన్ రెడ్డిలలో ఎవరో ఒకరికి అవకాశం దక్కనుంది. ఇప్పటికే ఈ ఇద్దరు నామినేషన్లు దాఖలు చేశారు.
KNOW
Vice President Election 2025 : ప్రతిపక్ష ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి నామినేషన్ దాఖలుచేశారు. కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ, ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు ఇండియా కూటమిలోని ఇతర పార్టీల నాయకులు ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నాయకులందరితో కలిసివెళ్లి రాజ్యసభ సెక్రటరీకి నామినేషన్ పత్రాలను సమర్పించారు జస్టిస్ సుదర్శర్ రెడ్డి.
ఇప్పటికే అధికార ఎన్డిఏ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలుచేశారు. ఆయన నామినేషన్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు, బిజెపి నాయకులు పాల్గొన్నారు. ఇలా ఇప్పటికే అధికార, ప్రతిపక్ష అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో అసలు ఎలక్షన్ ప్రాసెస్ ప్రారంభంకానుంది.
ఇకపై రసవత్తరంగా ఉపరాష్ట్రపతి ఎన్నికలు
తమ అభ్యర్థులకు మద్దతుకోసం ఇటు ఎన్డిఏ, అటు ఇండియా కూటమి ప్రయత్నాలు ప్రారంభించాయి... రెండు కూటముల్లో లేకుండా తటస్థంగా ఉన్న పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నాయి. ఇప్పటికే కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైస్ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతివ్వాలని కోరారు... ఇలా అన్నిపార్టీల నాయకులతో ఎన్డిఏ తరపున ఆయనే సంప్రదింపులు జరుపుతున్నారు.
ఇదిలావుంటే తెలుగు రాష్ట్రాల్లో ఉపరాష్ట్రపతి ఎన్నిక పొలిటికల్ హీట్ పెంచింది. ఇండియా కూటమి తెలుగు వ్యక్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని బరిలోకి దింపింది కాబట్టి ఇటు తెలంగాణ, అటు ఆంధ్ర ప్రదేశ్ లోని రాజకీయ పార్టీలన్ని ఆయనకే మద్దతివ్వాలని సీఎం రేవంత్ రెడ్డి కోరుతున్నారు. ఇలా తెలుగు సెంటిమెంట్ ను ముందుపెట్టి ఇండియా కూటమికి మద్దతు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సమయంలో ఇతరపార్టీలు బిసి సెంటిమెంట్ ను ముందుకు తీసుకువచ్చాయి.
బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే కాంగ్రెస్ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి ఎట్టి పరిస్థితుల్లో మద్దతివ్వబోమని స్పష్టం చేశారు. బిసిలపై ప్రేమను ఒలకబోసే కాంగ్రెస్ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బిసి అభ్యర్థిని ఎందుకు బరిలో దింపలేదు అని ప్రశ్నిస్తున్నారు. మరో అడుగు ముందుకేసి తెలంగాణకు చెందిన మేధావి కంచ ఐలయ్య లాంటివారికి అవకాశం ఇవ్వాల్సిందని సూచించారు.
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఏపార్టీ ఎటువైపు
మొత్తంగా చూసుకుంటే తెలంగాణ బిజెపి ఎంపీలు, ఏపీలోని కూటమి (టిడిపి, జనసేన, బిజెపి) ఎంపీలు ఎన్డిఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ కే ఓటేస్తారు. కేవలం కాంగ్రెస్, ఎంఐఎం ఎంపీలే ఇండియా కూటమి అభ్యర్థికి ఓటేసే అవకాశాలున్నాయి. ఇక బిఆర్ఎస్ ఎటువైపు ఉంటుందనేదే ఆసక్తికరంగా మారింది.
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆసక్తికర విషయం ఏమిటంటే పోటీలో ఉన్న ఇద్దరు అభ్యర్థులకు తెలంగాణతో సంబంధముంది. కాంగ్రెస్ బరిలోకి దింపిన అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి స్వయంగా తెలంగాణ వ్యక్తి. ఆయన ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టు జడ్జిగా కూడా పనిచేశారు. ఇక ఎన్డిఏ కూటమి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ కొంతకాలం తెలంగాణకు గవర్నర్ గా పనిచేశారు... అంతేకాదు ఈయన బిసి సామాజికవర్గానికి చెందినవారు. కాబట్టి ఈ ఇద్దరిలో ఎవరు ఉపరాష్ట్రపతి పీఠమెక్కినా తెలంగాణకు ప్రత్యేకమే.
