జర్నలిస్ట్ రామచంద్ర ఛత్రపతి హత్య కేసులో ప్రధాన నిందితుడు, డేరా సచ్చా సౌధ అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ బాబాపై పంచకులలోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఇవాళ తుది తీర్పు వెలువరించనుంది. ఈ నేపథ్యంలో పంజాబ్, హర్యానాలోని పలు ప్రాంతాల్లో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఇప్పటికే పెద్ద ఎత్తున సాయుధ బలగాలను మోహరించారు. సిర్సాకి చెందిన జర్నలిస్టు రామచంద్ర ఛత్రపతి ‘‘పూర్ సచ్’’ శీర్షికన డేరాబాబాపై తన పత్రికలో వరుస కథనాలు వెలువరించారు. ఈ క్రమంలో 2002లో రామచంద్ర హత్యకు గురయ్యారు.

డేరాబాబా ప్రధాన కార్యాలయంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలతో పాటు మరికొన్ని అక్రమాలు జరుగుతున్నాయని పత్రికలో రాసినందునే డేరాబాబా రామచంద్రను హత్య చేయించారని ఆరోపణలు వెల్లువెత్తాయి.

కాగా తన ఆశ్రమంలోని ఇద్దరు మహిళా సాధ్వీలపై అత్యాచారం చేసినట్లు రుజువుకావడంతో డేరాబాబాకు ఇప్పటికే 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. ప్రస్తుతం ఆయన రోహ్‌తక్‌లోని జైలులో శిక్షను అనుభవిస్తున్నారు. తాజాగా జర్నలిస్టు హత్యపై తీర్పు వెలువడటంతో 2017 ఆగస్టు 25 నాటి అల్లర్లు పునరావృతం కాకుండా ప్రభుత్వం పంచకులలో భద్రతను కట్టుదిట్టం చేసింది.