రాజస్థాన్ నూతన ముఖ్యమంత్రిగా అశోక్ గెహ్లాట్ ప్రమాణ స్వీకారం సందర్భంగా అరుదైన సంఘటన చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత జ్యోతిరాధిత్య సింధియా, రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే కుటుంబాల మధ్య రక్తసంబంధం ఉంది. అయితే వీరి మధ్య వైరం ఉంది.

ఈ క్రమంలో వసుంధర.. జ్యోతిరాధిత్య సింధియాను ఆలింగనం చేసుకోవడం పలువురిని ఆశ్చర్యపరిచింది.  మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ రాజకుటుంబానికి చెందిన విజయరాజే సింధియాకు ముగ్గురు కుమార్తెలు, ఒక  కుమారుడు మాధవరావు.

వీరిలో ఒక కుమార్తె వసుంధర రాజే కాగా, మరో కుమార్తె యశోధర రాజే విదేశాల్లో ఒక డాక్టర్‌ని పెళ్లాడి విడాకులు తీసుకుని స్వదేశానికి వచ్చి బీజేపీలో చేరారు. కుమారుడు మాధవరావు సింధియా. ఆయన కొడుకే జ్యోతిరాధిత్య సింధియా.

గతంలో విజయరాజే 1957లో కాంగ్రెస్ టిక్కెట్‌పై తొలిసారి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత పార్టీని వీడి జనసంఘ్‌లో, బీజేపీలో క్రియాశీలక పాత్ర పోషించారు. గుణ లోక్‌సభ సీటు నుంచి బీజేపీ నుంచి నాలుగు సార్లు గెలిచి.. పార్టీని పటిష్టం చేశారు.

అయితే అదే సమయంలో మాధవరావు సింధియా కాంగ్రెస్‌లో చేరడంతో కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి. తల్లి బీజేపీలో కీలకపాత్ర పోషిస్తుండగా.. కుమారుడు మాధవరావు సింధియా కాంగ్రెస్‌లో చురుకైన పాత్ర పోషించారు.

మరోవైపు వసుంధర, యశోధర కూడా తల్లికి చేదోడు వాదోడుగా ఉంటూ బీజేపీలోనే కొనసాగారు. వసుంధర ఇప్పటికే రెండుసార్లు రాజస్థాన్ సీఎంగా పనిచేశారు. అయితే తల్లీ, కొడుకుల మధ్య విభేదాలు వ్యక్తిగత స్థాయికి వెళ్లి కుటుంబాన్ని చీల్చింది.

చివరికి ఇది తన మరణానంతరం అంత్యక్రియలు నిర్వర్తించడానికి మాధవరావు అనర్హుడని విజయరాజే పేర్కొనే స్థాయికి వెళ్లింది. ఆ ప్రకారం ఆమె వీలునామా సైతం రాశారు. ఈ కుటుంబాలను కలిపేందుకు బీజేపీ అగ్రనేత, ప్రధాని వాజ్‌పేయ్ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఫలించలేదు.

విజయరాజే, మాధవరావు సింధియాలు యాధృచ్చికంగా ఒకే ఏడాది మరణించారు. పెద్దలు చనిపోయినా రెండు కుటుంబాలు పంతాన్ని మాత్రం వీడలేదు. తండ్రి మాధవరావు 2001లో హెలికాఫ్టర్‌ ప్రమాదంలో మరణించగా, ఆయన కుమారుడు జ్యోతిరాధిత్య సింధియా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు.

2002లో గుణ లోక్‌సభ సీటు నుంచి తొలిసారి గెలిచిన జ్యోతిరాధిత్య ప్రస్తుతం మధ్యప్రదేశ్ కాంగ్రెస్ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. యూపీఏ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా పనిచేసిన ఆయన ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌నే ఓడించడంలో వ్యూహాత్మకంగా వ్యవహారించారు.

హార్వర్డ్ విశ్వవిద్యాలయం, స్టాన్‌ఫోర్డ్ బిజినెస్ స్కూలులో ఉన్నత విద్యనభ్యసించిన జ్యోతిరాధిత్య ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్‌కు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడ్డారు. ఈ క్రమంలో రాజస్థాన్‌లో అత్తయ్య వసుంధరతో జ్యోతిరాధిత్య మాట్లాడటంతో రెండు కుటుంబాల మధ్య శతృత్వం సమసిపోతుందా లేదంటే ఇది మాట వరసకేనా అన్నది తెలియాలంటే కొద్దిరోజుల్లో తెలిసిపోతుంది.