జమ్ము కశ్మీర్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం వైష్ణోదేవి ఆలయానికి గత ఇరవై ఏళ్లలో 1,800 కేజీల బంగారం విరాళంగా వచ్చింది. సమాచారహక్కు చట్టం ద్వారా ఈ విషయం బహిర్గతమైంది.

బంగారంతో పాటు 4,700 కిలోల వెండి, రూ. 2000 కోట్ల నగదు ఆలయానికి భక్తులు సమర్పించారని తేలింది. సామాజిక కార్యకర్త హేమంత్‌ గునియా సమాచార హక్కు చట్టం కింద చేసిన దరఖాస్తు ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

‘వర్షాకాలం నేపథ్యంలో ఆలయ బోర్డు ఈ సొమ్మును యాత్రికులకు వసతులు కల్పించేందుకు ఉపయోగించాలని హేమంత్ కోరారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల నిర్మాణానికి కూడా ఉపయోగించవచ్చని ఆయన విజ్ఞప్తి చేశారు.

కరోనా కారణంగా ఆలయానికి భక్తుల తాకిడి గతేడాది భారీగా తగ్గినట్లు ఆర్టీఐ ద్వారా తెలిసింది. మహమ్మారి వల్ల 2020లో కేవలం 17 లక్షల మందే వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించారట.