లాక్ డౌన్ సమయంలో వలసలను ప్రోత్సహించి దేశంలో కరోనా పెరగడానికి కాంగ్రెస్ కారణమైందని ప్రధాని నరేంద్ర మోడీ చేసి వ్యాఖ్యలకు ప్రియాంక గాంధీ స్పందించారు. కార్మికులు ఆహారం, సౌకర్యాలు లేకుండా ఇబ్బందులు పడుతుంటే తాము చూడలేకపోయామని.. అందుకే తాము సహాయం చేశామని  తెలిపారు. 

Uttarakhand Election news 2022 : ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ‘కాంగ్రెస్ స్ప్రెడ్ కోవిడ్-19 (Congress spread COVID-19) ’ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ (priyanka gandhi) స్పందించారు. ఎలాంటి సౌక‌ర్యాలు లేకుండా ఇబ్బంది ప‌డుతున్న వారికి సహాయం చేయ‌డం త‌ప్పెలా అవుతుంద‌ని అన్నారు. శుక్ర‌వారం ఆమె ఉత్త‌రాఖండ్ (Uttarakhand)లో ని ఖతిమా (kathima)లో నిర్వ‌హించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. ‘‘ ఉత్తరాఖండ్‌లో వలసలు ఎక్కువగా ఉన్నాయి. ఇది ఎందుకు జరుగుతుంది ? రాష్ట్రంలో ఉద్యోగాలు లేనప్పుడే వలస వెళ్తారు. మీ రాష్ట్రంలో హిమాలయాలు, ప్రకృతి, పర్యాటక అవకాశాలు ఉన్నాయి. కానీ ఉపాధి లేదు. ఉద్యోగాల కోసం ప్రజలు ఇక్కడ నుండి వలస వస్తున్నారు ’’ అని ప్రియాంక గాంధీ అన్నారు. 

‘‘ రాజకీయ నాయకుడి అతి పెద్ద కర్తవ్యం ఏమిటి ? ప్రజలకు సేవ చేయడమే మొదటి కర్తవ్యం. అయితే బీజేపీ నాయకులందరూ మీ సీఎం నుంచి దేశ ప్ర‌ధాని వ‌ర‌కు వారి సొంత అభివృద్ధి గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. ఎవరూ మీ గురించి ఆలోచించడం లేదు ’’ అని ప్రియాంక గాంధీ ఓట‌ర్ల‌ను ఉద్దేశించి అన్నారు. 

గత ఏడాది వలస వచ్చినవారిని తమ సొంత రాష్ట్రాలకు తిరిగి వచ్చేలా ప్రోత్సహించడం ద్వారా కాంగ్రెస్ (Congress) COVID-19 ను వ్యాప్తి చేసిందని ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వాదనపై ప్రియాంక గాంధీ ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఎలాంటి సౌకర్యాలు లేకుండా రోడ్లపై తిరుగుతున్న కార్మికులకు తమ పార్టీ సహాయం చేసిందని చెప్పారు. వాళ్లని అలా ఎందుకు వ‌దిలేస్తామ‌ని అన్నారు. వాళ్ల‌ని వారి సొంత ఇంటికి పంపించి త‌మ డ్యూటీ చేశామ‌ని తెలిపారు. ‘‘ ప్రవాస కార్మికులకు కాంగ్రెస్ సహాయం చేసిందని, ఆ స‌మ‌యంలో రాజకీయాలు చేయడం ద్వారా దేశవ్యాప్తంగా కరోనా (corona)ను వ్యాప్తి చేసిందని ప్రధాని అన్నారు. వారు రోడ్లపై నడుస్తున్నారు, వారికి ఎలాంటి సౌకర్యాలు లేవు. మేము వారిని అలా వదిలేస్తామా ? మేము రాజకీయాలు చేశామా ? మేము మా క‌ర్త‌వ్యం నిర్వ‌ర్తించాం ’’ అని ప్రియాంక గాంధీ అన్నారు. 

‘‘ ప్రధానమంత్రికి మిత్రులైన ఇద్దరు పారిశ్రామికవేత్తల కోసమే మొత్తం దేశ విధానాలు కొనసాగుతున్నాయి. బడ్జెట్ వచ్చినప్పుడు పేదలు, రైతులు, మధ్యతరగతి, చిన్న మరియు మధ్యతరగతి వ్యాపారులకు వారు ఏమీ అందించారు. కానీ వీరే దేశానికి వెన్నుముక ’’ అని తెలిపారు. బీజేపీది పేదల ప్రభుత్వం కాదని తెలిపారు. ఇది ధనికుల అనుకూల ప్రభుత్వం అని అన్నారు. కాబట్టే ప్రభుత్వం ప్రజలకు సహాయం చేయలేదని ప్రియాంక గాంధీ ఆరోపించారు.

ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ఉన్న 70 స్థానాల‌కు ఫిబ్రవరి 14వ తేదీన ఒకే ద‌శ‌లో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10వ తేదీన ఓట్లు లెక్కింపు చేప‌ట్టి ఫ‌లితాలు విడుద‌ల చేస్తారు. ప్ర‌స్తుతం ఈ రాష్ట్రంలో బీజేపీ అధికార పార్టీగా ఉంది. ఈ సారి కూడా దాదాపు 60 స్థానాలు గెలుచుకోవాల‌ని ఆ పార్టీ ప్ర‌య‌త్నం చేస్తోంది. అయితే ఇక్క‌డ అధికారం చేప‌ట్టేందుకు కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ (aap)కూడా తీవ్రంగా శ్ర‌మిస్తున్నాయి.