ఉత్తరఖాండ్ లో నిర్వహించిన శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసగించారు. ఈ సారి కూడా రాష్ట్రంలో బీజేపీ ఫ్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

Uttarakhand Election News 2022 : ఉత్తరాఖండ్ (Uttarakhand)లో భారతీయ జనతా పార్టీ (bjp) మళ్లీ అధికారంలోకి వస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ (prime minister narendra modi) శుక్రవారం విశ్వాసం వ్యక్తం చేశారు. మరో 3 రోజుల్లో ఆ రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో శుక్ర‌వారం అల్మోరాలో జరిగిన ర్యాలీలో మోడీ పాల్గొన్నారు. ఓట‌ర్ల‌ను ఉద్దేశించి ప్ర‌స‌గించారు. ఓట‌ర్లు మంచి ఉద్దేశ్యంతో ఓటు వేస్తారని అన్నారు.

గురువారం జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల మొదటి విడతలో ప్రజలు భారీ సంఖ్యలో ఓటు వేయడానికి హాజరయ్యారని ప్రధాని చెప్పారు. “ నిన్న జరిగిన యూపీ ఎన్నికలలో మొదటి దశ పోలింగ్ జరిగింది. ఈ పోలింగ్ అయిపోయిన త‌రువాత బీజేపీ రికార్డు సంఖ్యలో గెలుస్తుందని స్పష్టమైంది. ఈ ఎన్నికలలో బీజేపీని గెలిపించాలని మనకంటే ఎక్కువ మంది ప్రజలు కృత నిశ్చయంతో ఉన్నారు. ఓటర్లు ఎన్నడూ మంచి ఉద్దేశం లేని వారి వైపు వదలరు.’’ అని ప్రధాని మోడీ అన్నారు.

ఈ దశాబ్దం ఉత్తరాఖండ్‌కు చెందినద‌ని, ఈ అవకాశాన్ని వదులుకోవద్ద‌ని తెలిపారు. ఉత్తరాఖండ్ ప్రజల శక్తిని, మంచి ఉద్దేశాన్ని, చిత్తశుద్ధిని తాను గుర్తించాన‌ని చెప్పారు. ‘పర్యతన్’ (పర్యాటకం) లేదా ‘పలయన్’ 
(వలస)ను ప్రోత్సహించే వారు అధికారంలో ఉండాలనుకుంటున్నారా అనేది ఉత్త‌రాఖండ్ ప్ర‌జ‌లు నిర్ణ‌యించుకోవాల‌ని చెప్పారు. రాష్ట్రంలో ఇటీవల రూ.17,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అన్నారు. ఇవి పూర్త‌యితే చార్ ధామ్ ఆల్-వెదర్ రోడ్డు తనక్‌పూర్-పితోర్‌ఘర్ సెక్షన్‌కు ప్రయోజనం చేకూరుస్తుంద‌ని తెలిపారు. 

2022 బడ్జెట్‌లో తాము కొండ ప్రాంతాలకు రోప్‌వే (road way) లను నిర్మించడానికి ‘పర్వతమాల పథకాన్ని’ ప్రతిపాదించామని అన్నారు. తాము రాష్ట్రంలో ఆధునిక రహదారులు, రవాణా మౌలిక సదుపాయాలను నిర్మిస్తామని తెలిపారు. రాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన బీజేపీ ప్రాధాన్యత అని పర్వతమాల, వైబ్రంట్ విలేజ్ ప్రాజెక్టుల వల్ల అక్కడి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంద‌ని అన్నారు. 
ఉత్తరాఖండ్ అభివృద్ధే డబుల్ ఇంజిన్ ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అని చెప్పారు. 

ఈ ఎన్నిక‌లు ముగిసి ఫ‌లితాలు వ‌చ్చిన మార్చి 10వ తేదీన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ధామీ జీ ప్రభుత్వం దూకుడుగా పని చేస్తుంద‌ని హామీ ఇచ్చారు. మనస్‌ఖండ్ టూరిజం సర్క్యూట్‌ను ఉత్తరాఖండ్‌లోని కుమావోన్‌లో రాబోయే 5 సంవత్సరాలలో ప్రాధాన్యతపై అభివృద్ధి చేస్తామ‌ని తెలిపారు. 

ఇది ఇలా ఉండగా.. ఉత్తరాఖండ్‌లో ఫిబ్రవరి 14వ తేదీన ఒకే ద‌శ‌లో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10వ తేదీన ఓట్లు లెక్కింపు చేప‌ట్టి ఫ‌లితాలు విడుద‌ల చేస్తారు. ఉత్తరాఖండ్ ఉన్న 70 స్థానాల్లో క‌నీసం 60 స్థానాల‌ను గెలుచుకోవాల‌ని బీజేపీ అనుకుంటోంది. దానికి అనుగూణంగా ప్ర‌ణాళిక‌లు కూడా చేస్తోంది. విస్తృతంగా ప్ర‌చారం చేప‌డుతోంది. అందులో భాగంగానే ప్రధాని నరేంద్ర మోడీ వంటి జాతీయ నాయకులను రాష్ట్రానికి తీసుకొచ్చి ప్రచారం నిర్వహిస్తున్నారు. మరో వైపు ఈ సారి ఉత్తరాఖండ్ లో పాగా వేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ (aap) కూడా గ‌ట్టిగానే ప్ర‌యత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ క‌న్వీన‌ర్, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ (aravind kejriwal) రెండు నెల‌ల నుంచి ఈ రాష్ట్రానికి ప‌లు సార్లు వ‌చ్చి వెళ్లారు.