లాక్‌డౌన్ ఎఫెక్ట్: ఉత్తర్‌ప్రదేశ్‌లో పోలీస్ స్టేషన్ లో పెళ్లి చేసుకొన్న జంట
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర పోలీసులు ఓ జంటకు తమ పోలీస్ స్టేషన్ లో పెళ్లి చేశారు . ముందుగా నిర్ణయించుకొన్న ముహుర్తానికే పెళ్లి చేసుకోవాలని ఆ జంట తీసుకొన్న నిర్ణయానికి అనుగుణంగా పోలీస్ స్టేషన్ లో పెళ్లి జరిగింది.
లక్నో:ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర పోలీసులు ఓ జంటకు తమ పోలీస్ స్టేషన్ లో పెళ్లి చేశారు . ముందుగా నిర్ణయించుకొన్న ముహుర్తానికే పెళ్లి చేసుకోవాలని ఆ జంట తీసుకొన్న నిర్ణయానికి అనుగుణంగా పోలీస్ స్టేషన్ లో పెళ్లి జరిగింది.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని మహుజీకి చెందిన అనిల్, ఘాజీపూర్ కు చెందిన జ్యోతిలకు పెద్దలు పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ నెల 20 వ తేదీన పెళ్లికి ముహుర్తంగా నిర్ణయించారు. ఈ నిర్ణయం కరోనా లాక్ డౌన్‌కి ముందు తీసుకొన్నారు.
పెళ్లి చేసుకోవడానికి ఫంక్షన్ హాల్స్ ఇవ్వడం లేదు. నిర్ణీత ముహుర్తానికే పెళ్లి చేసుకోవాలంటే పరిమితమైన సంఖ్యలోనే అతిథులను పిలుచుకొనేందుకు అనుమతి ఇస్తున్నారు. సోషల్ డిస్టెన్స్ పాటించకపోతే కేసులు పెట్టే అవకాశం ఉంది. దీంతో ఏం చేయాలనే విషయమై అనిల్ పోలీసులను ఆశ్రయించాడు.
పోలీసులు అనిల్ కు తాము అండగా ఉంటామని అభయం ఇచ్చారు. ధీనా పోలీస్ స్టేషన్ పెళ్లి మండపంగా మారింది. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ పోలీస్ స్టేషన్ లోనే వేద మంత్రాల మధ్య అనిల్, జ్యోతిలు ఈ నెల 20వ తేదీన పెళ్లి చేసుకొన్నారు.
also read:కరోనా దెబ్బ: ఆసుపత్రికి గర్భిణీకి నో పర్మిషన్, చిన్నారి మృతి
గతంలో ఈ ప్రాంతంలో జరిగిన బోటు ప్రమాదంలో తన ప్రాణాలను ఫణంగా పెట్టి అనిల్ పలువురి ప్రాణాలు కాపాడాడు. దీంతో అనిల్ తన పెళ్లి గురించి సమస్యను తమ దృష్టికి తీసుకురావడంతో పోలీస్ స్టేషన్ లో పెళ్లి చేసినట్టుగా పోలీసులు తెలిపారు. వధూవరుల తరపున ఐదుగురు చొప్పున పది మంది మాత్రమే హాజరయ్యారు.
ఈ స్టేషన్ లో పనిచేసే పోలీసులు ఈ పెళ్లికి అతిథులుగా హాజరయ్యారు.