ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మహిళల అంశం ప్రధాన పాత్ర పోషిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మహిళల అంశాలపైనే ప్రచారం చేస్తుండగా బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీలు కూడా అదే దారిలో వెళ్తున్నాయి. తాజాగా, ప్రియాంక గాంధీ ఇచ్చిన మారథాన్ పిలుపునకు మహిళల నుంచి విశేష స్పందన వచ్చింది. ఆ మారథాన్ వీడియోలను కాంగ్రెస్ ట్వీట్ చేసింది.
లక్నో: హత్రాస్, ఉన్నావ్ సహా ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని పలుప్రాంతాల్లో జరిగిన లైంగికదాడులు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. కొన్ని నెలలపాటు ఆ ఘటన తాలూకు ఆగ్రహజ్వాలలు రేగాయి. ఉత్తరప్రదేశ్‌లో మహిళ(Women)లకు రక్షణ లేదని కాంగ్రెస్(Congress) చాలా కాలంగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నది. అయితే, అదే సందర్భంలో ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ చాలా వరకు క్రియారహిత దశకు చేరుకుంది. ఉనికిని కోల్పోయే ప్రమాదాన్నే అది ఎదుర్కొంటున్నది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బాధ్యతను మహిళా నేత ప్రియాంక గాంధీకి అప్పగించింది. అప్పటి నుంచి ఆమె ఉత్తరప్రదేశ్‌లో విస్తృత పర్యటనలు చేస్తున్నారు. అనేక ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అయితే, ఆమె ప్రచార క్యాంపెయిన్‌లో మహిళల అంశం ప్రధానంగా కనిపిస్తున్నది. మహిళల నుంచి పోటీ చేయడానికి అభ్యర్థిత్వం ఆహ్వానించడం, మారథాన్ నిర్వహించడం,‘ఆడపిల్లను.. పోరాడగలను’ వంటి నినాదాలు ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. తాజాగా, ప్రియాంక గాంధీ వాద్రా(Priyanka Gandhi) ఇచ్చిన మారథాన్ పిలుపునకు విశేష స్పందన వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని మహిళలు పెద్ద ఎత్తున ఈ మారథాన్‌లో పాల్గొన్నారు. ఆ వీడియోలనూ కాంగ్రెస్ పార్టీ తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేసింది.
ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వం ఈ మారథాన్‌కు పర్మిషన్ ఇవ్వలేదు. మారథాన్‌లో పాల్గొనరాదని అధికారులు తెలిపారు. కానీ, ఆ మహిళలు పర్మిషన్‌ను పట్టించుకోలేదు. లక్షలాది మంది విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేసే ప్రభుత్వ కార్యక్రమానికి ఒమిక్రాన్ వేరియంట్ నిబంధనలు అడ్డురావా? ఇప్పుడు ఎందుకు తమను ఆపుతున్నారు? అంటూ ఓ మహిళ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది.
Also Read: Priyanka Gandhi : ఉద్యోగాల్లో మహిళలకు 40 శాతం రిజర్వేషన్..
మరొక విషయం ఈ మారథాన్‌లో గెలుపొందిన వారికి కాంగ్రెస్ పార్టీ బహుమానాలు ప్రకటించింది. గెలిచిన ముగ్గురు విన్నర్లకు స్కూటీ బహూకరించనున్నట్టు ప్రకటించింది. విన్నర్ల జాబితాలో నాలుగో వ్యక్తి నుంచి 25వ వ్యక్తి వరకు స్మార్ట్‌ఫోన్ అందజేయనుంది. తర్వాతి వంద మందికి ఫిట్‌నెస్ బ్యాండ్‌లు, ఆ తర్వాత వేయి మంది మహిళలకు మెడల్స్ అందించనున్నట్టు కాంగ్రెస్ ప్రకటించింది. మారథాన్‌లో పాల్గొనడానికి ఎలాంటి ఎంట్రీ ఫీజును పార్టీ అడగలేదు.
ఏది ఏమైనా.. వచ్చే ఏడాది తొలినాళ్లలో జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మహిళల అంశం కీలక పాత్ర పోషిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా మహిళల అంశాలను తెరమీదకు తెస్తుండగా.. ఇతర పార్టీలూ అదే దారిలో వెళ్తున్నాయి. మహిళల సంక్షేమం కోసం బీజేపీ కూడా పలు పథకాలను ప్రకటించింది. ఎన్నికల్లో కీలకమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ రెండు నెలల వ్యవధిలో పది సార్లు పర్యటించారు. 16 లక్షల మంది మహిళలకు లబ్ది చేకూర్చేలా రూ. 1000 కోట్లను వారి బ్యాంకు ఖాతాల్లోకి ట్రాన్స్‌ఫర్ చేసింది.
Also Read: 40శాతం టికెట్లు మహిళలకే.. ఉన్నావ్ బాధితురాలి కోసం నిర్ణయం.. ప్రియాంక గాంధీ సంచలన ప్రకటన
సమాజ్ వాదీ పార్టీ కూడా గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు మహిళలకు చేసిన ప్రయోజనాలు, తెచ్చిన పథకాలను గురించి చర్చిస్తున్నది. మహిళలకు తొలిసారిగా గ్యాస్ సిలిండర్లను అందించిన ఘనత సమాజ్‌వాదీ పార్టీదేనని ఇటీవలే పేర్కొంది. కానీ, ఇప్పటి ప్రభుత్వం తరహాలో వాటితో సెల్ఫీలు దిగే పని సమాజ్‌వాదీ నేతలు చేయలేదని తెలిపింది.
